ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం సరికాదని మాజీ ఎంపీ అశోక్ గజపతి రాజు అన్నారు. మాన్సాస్ ట్రస్టు వివాదం పై గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అశోక్ గజపతి రాజు స్పందించారు.

మాన్సాస్ ట్రస్ట్  ఛైర్మన్ నియామకంలో ప్రభుత్వ తీరుపై అశోక గజపతిరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరి వింతగా ఉందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు జీవోనీ కనీసం బయట పెట్టలేదని ఆయన అన్నారు.వేరే మతం వారిని నియమిస్తే సమస్యలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రస్టు,దేవాలయ భూములపై కన్నేశారని మండిపడ్డారు. దాతల భూములు ఆలయాలకే చెందాలన్నారు.

Also Read అశోక్ గజపతి రాజుకు షాక్ పెద్ద కుట్ర: సంచయితకు షో కాజ్ నోటీస్...

ఆలయాల వ్యవహారాల్లో రాజకీయాలు చేయొద్దని సూచించారు. మాన్సాస్‌ చైర్మన్‌ పదవి మార్పు వింతగా ఉందన్నారు. భక్తుల నమ్మకాలపై దెబ్బకొట్టారని ధ్వజమెత్తారు. వంశపారంపర్య పదవుల్లో, ట్రస్టుల్లో అన్యమతస్తుల జోక్యం సరికాదని పేర్కొన్నారు. మాన్సాస్‌ ట్రస్ట్‌లో దేవాదాయ శాఖ అధికారులతోనే... నిర్వీర్యం చేయడానికి కొన్నాళ్లుగా ఎత్తుగడలు వేశారని ఆరోపించారు. 

రాష్ట్రంలో ఎన్ని పార్టీలు మారినా... ఇలాంటి సమస్యలు రాలేదని వాపోయారు. రాజకీయాలతో సంబంధంలేని సంస్థకు రాజకీయాలు ఆపాదించడం దేశానికి అరిష్టమని తెలిపారు. తనకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పదవి నుంచి తొలగించారన్నారు. జీవో కాపీ అందిన తర్వాత కోర్టును ఆశ్రయించాలా?... ఏ విధమైన పోరాటం చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ వైఖరి వల్ల పరిశ్రమలు, పెట్టుబడిదారులు వెళ్లిపోతున్నారని అశోక్‌ గజపతిరాజు వ్యాఖ్యానించారు. 

కాగా...  ఇటీవల మాన్సాస్ ట్రస్టు విషయంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌(మాన్సాస్‌) ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా ఆనందగజపతి కుమార్తె సంచయిత గజపతిరాజును నియమించింది. దీంతో ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీ టీడీపీ... ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టింది.

1958 సంవత్సరంలో దివంగత పివిజి రాజు మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్ప్ అండ్ సైన్సెస్ (మాన్సాస్)ను నెలకొల్పారు. విద్యా వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు మాన్సాస్ విద్యా సంస్థలను నడుపుతోంది. 1958సంవత్సరంలో పివిజి రాజు వ్యవస్థాపక చైర్మన్‌ కాగా ఆనంద గజపతిరాజు, అశోక్‌ గజపతిరాజు ట్రస్ట్‌ బోర్డు సభ్యులుగా ఉండేవారు. 

1994 సంవత్సరంలో పివిజి రాజు మరణం చెందిన తర్వాత ఆనంద గజపతిరాజు చైర్మన్‌ అయ్యారు. 2016లో ఆయన మరణం తర్వాత అశోక్‌ గజపతిరాజు చైర్మన్‌ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆనంద గజపతి రాజు కుమార్తె సంచయిత గజపతిరాజుకు మాన్సస్ ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో తాజాగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ ఆయన మాట్లాడారు.