జగన్, చంద్రబాబు వ్యక్తిత్వాల మధ్య తేడా ఇదే: సజ్జల రామకృష్ణారెడ్డి
ముఖ్యమంత్రి జగన్, చంద్రబాబు వ్యక్తిత్వాల మధ్య తేడాను వివరిస్తూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
గుంటూరు: కరోనా మహమ్మారిపై జగన్ ప్రభుత్వం పోరాడుతున్న కీలకమైన సమయంలో నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాల్సిన బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆయన ప్రస్తుతం ఆర్భాటాలు మాత్రమే చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికన సజ్జల విమర్శించారు.
''ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. ఆయనకు ప్రజల అంశాలు పట్టవు. ఏ స్థానంలో ఉన్నా చేసేవి నీచ రాజకీయాలే. ఆయనే చంద్రబాబు. వీడియో కాన్ఫరెన్సులు, టెలికాన్ఫరెన్స్‌ల పేరిట హడావుడి, ఆర్భాటాలు తప్ప ఒక్క నిర్మాణాత్మక ఆలోచన కూడా లేదు'' అని సజ్జల విమర్శించారు.
''ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రచారలబ్ధి పొందాలనే కుటిల రాజకీయ సూత్రం నుంచి చంద్రబాబు ఇంకా బయటపడలేదు. దీని ద్వారా ఆయన దారుణ వ్యక్తిత్వాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పి విష ప్రచారం చేసే దుర్భుద్ధి ఆయనకు పోలేదు'' అని చంద్రబాబు వ్యక్తిత్వం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
''కరోనా విపత్తు వచ్చింది మొదలు సీఎం వైఎస్ జగన్ గారు వీటన్నింటికీ దూరంగా ఉంటూ ప్రజలకు మంచి చేసే ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. ఆర్థిక కష్టాలు ఉన్నా ప్రజలకు నష్టం కలగకూడదనే ముందుకు సాగుతున్నారు'' అని జగన్ పై ప్రశంసలు కురిపించారు.
''సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్, మత్స్యకార భరోసా, రైతు భరోసా, సున్నా వడ్డీ పథకాలను అమలు చేస్తున్నారు. కరోనా సాకు చూపి ఎగ్గొట్టాలని చూడలేదు. మాట తప్పడం లేదు. ఇక్కడే ఇద్దరు నాయకుల వ్యక్తిత్వాల మధ్య తేడా మరోసారి కనిపిస్తోంది'' అని సజ్జల పేర్కొన్నారు.