జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడే కాదని.. ఓ పెయిడ్ ఆర్టిస్టు అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు  నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ చదువుతున్నారని ఆరోపించారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడే కాదని.. ఓ పెయిడ్ ఆర్టిస్టు అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ చదువుతున్నారని ఆరోపించారు. చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్ ప్రయత్నం అని మండిపడ్డారు. జగనన్న సురక్ష కార్యక్రమంతో పాలనను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్తున్నామని చెప్పారు. టీడీపీ ఎప్పుడూ ఇలాంటి ఆలోచన చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు మింగుడు పడటం లేదని అన్నారు.

ఇచ్చిన ఏ హామీని నెరవేర్చని చంద్రబాబుకు ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు. టీడీపీ మిని మేనిఫెస్టోతో చంద్రబాబు నవ్వుల పాలయ్యారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో గంజాయిని నిర్మూలించేందుకు చిత్తశుద్దితో పనిచేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని.. ప్రజలు వాటిని నమ్మే పరిస్థితి లేదని అన్నారు. 

ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి నిజాయితీపరుడని అన్నారు. ముద్రగడ ఆయన కులం కోసం బలంగా నిలబడ్డారని అన్నారు. ఎన్నో రాజకీయ త్యాగాలు చేశారని.. నమ్మినదానిపై నిలబడ్డ వ్యక్తి అని అన్నారు. ఆయన కులాన్ని ఎప్పుడూ వాడుకోలేదని.. నిజాయితీగా పనిచేశారని అన్నారు. కాపులకు న్యాయం చేసేందుకు ముద్రగడ నిలబడ్డారని అన్నారు. అలాంటి ముద్రగడ వెనక వైసీపీ ఉందంటే ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ మాత్రం ఆడించినట్టుగా ఆడతాడనేది నిరూపితమైందని అన్నారు. టీడీపీ బస్సు యాత్రలో నాయకులే ఉండటం లేదని విమర్శించారు. 

టెక్నికల్‌గా ట్రిప్పు కావడం తప్ప.. ఆంధ్రప్రదేశ్‌లో పవర్‌ కట్స్ లేవని సజ్జల చెప్పారు. ఏపీలో పవర్ కట్‌లు లేవని.. తెలంగాణ పల్లెల్లో మాత్రం కచ్చితంగా ఉన్నాయని అన్నారు. అందుకు సంబంధించి రికార్డులు తీస్తే తెలుస్తుందని చెప్పారు. అది వాళ్ల రాష్ట్ర సమస్య కదా అని తాము మాట్లాడటం లేదని అన్నారు. 

తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనొచ్చని సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్‌పై సజ్జల స్పందిస్తూ.. హైదరాబాద్ అమ్మితే వస్తుందని, ముంబైలో అమ్మితే 1,000 ఎకరాలు కూడా వస్తాయని, న్యూయార్క్‌లో అమ్మితే 10,000 ఎకరాలు కూడా వస్తాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందులో గర్వంగా చెప్పుకోవడానికి ఏముందో తనకు అర్థం కాలేదని అన్నారు. ఎన్నికల వస్తున్నందుకే అలా మాట్లాడుతున్నారని విమర్శించారు.