అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని. తెలంగాణ రాష్ట్రంలో అభంశుభం తెలియని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులపై స్పందించకపోవడం దారుణమన్నారు. 

చనిపోయిన విద్యార్థుల కోసం ట్వీట్ చెయ్యడానికి గానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి గానీ నోరు రాలేదని విమర్శించారు. కానీ రామ్ గోపాల్ వర్మ లాంటి సైకో దర్శకుడికి మద్దతు తెలుపుతూ జగన్ తన సైకోయిజాన్ని బయటపెట్టారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్టకు భంగం కలిగేలా ఒక సైకో దర్శకుడు పనికిమాలిన, పనికిరాని చెత్త సినిమాను తీస్తే దానికి మద్దతు తెలుపుతారా అంటూ విరుచుకుపడ్డారు. రామ్ గోపాల్ వర్మకు ఉన్న బాధ జగన్ కు పెద్ద సమస్యగా మారినట్లు ఉందన్నారు. 

మరోవైపు హైదరాబాద్ లో ఉంటూ అమరావతిలో ఐదేళ్లపాటు ఒక్కో ఇటుకు పేర్చి నిర్మించుకున్న ఇంటికి టూ లెట్ బోర్టు పెట్టుకుంటే మంచిదని సూచించారు. ఇప్పటికే ఏపీకి టూరిస్ట్ లా జగన్ మారిపోయారని ఆమె విమర్శించారు. ఇప్పటికీ హైదరాబాద్ లోనే జగన్ ఉన్నారని ఆమె తిట్టిపోశారు.

 మే 23 తర్వాత వైఎస్ జగన్ శాశ్వతంగా ఏపీకి టూరిస్ట్ గా మారిపోతారని అందువల్ల జగన్ తాను కట్టుకున్న ఇంటికి టూలెట్ బోర్డు పెట్టుకుంటే మంచిదన్నారు. ఆ ఇంట్లో ఒక ఐటీ కంపెనీ పెట్టుకుంటే కనీసం అద్దె అయినా వస్తుందన్నారు. 

వైఎస్ జగన్ సంపాదించిన పాపపు సొమ్మును మంచి పనుల కోసం వినియోగిస్తే ఇప్పుడు కాకపోయినా వచ్చే ఏడాదిలో అయినా సీఎం కావాలనుకునే మీ కల నిజమవుతుందని చెప్పుకొచ్చారు. 

సీఎం కావాలనుకున్న మీకల అప్పుడైనా నెరవేరాలని తాను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు సాధినేని యామిని తెలిపారు. ప్రధాని మోదీ, కేసీఆర్, జగన్‌లకు మే 23న గుణపాఠం తప్పదని సాధినేని యామిని హెచ్చరించారు.  

ఈ వార్తలు కూడా చదవండి

రామ్ గోపాల్ వర్మ సైకో... సాధినేని యామిని