విశాఖలో రాజధాని ఏర్పాటుపై సీఎం జగన్‌కు చెందిన పత్రికతో పాటు ఒక ప్రైవేటు ఏజెన్సీతో సర్వే చేస్తే 62 శాతం ప్రజలు వ్యతిరేకించారని మాజీ ఎంపీ సబ్బం హరి వెల్లడించారు. సచివాలయం మినహా విశాఖకు వచ్చేది ఏమీలేదన్న భావన ప్రజల్లో ఉందన్నారు. కాబట్టి జగన్ సర్కార్ దీన్ని పరిగణలోకి తీసుకుని విశాఖలో రాజధానిపై ప్రజా బ్యాలెట్‌ పెట్టాలని సూచించారు. 50 శాతం అనుకూలంగా వస్తే తప్పయిందని ఒప్పుకుని లెంపలేసుకుంటానని సబ్బం హరి తెలిపారు. 

''పొట్ట విప్పితే అక్షరం ముక్కరాని న్యాయ నిపుణులు సలహాదారులుగా ఉండడం వల్లే కోర్టుల్లో ఈ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రోడ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయని, అమరావతిని ఒక బూత్‌ బంగ్లాగా మార్చే ప్రయత్నం జరుగుతున్నది. రాజధాని నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఏం చేసిందని ప్రశ్నిస్తున్న నాయకులు.... ఒక్క భూసమీకరణకే రెండున్నరేళ్లు పట్టిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి'' అని పేర్కొన్నారు. 

''రాజధాని నిర్మాణం జరగకుండా ఎన్‌జీటీలో పిటిషన్‌ వేసి అడ్డుకున్నదెవరో అందరికీ తెలుసు. ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులు అడ్డుకుంటున్నాయనే భావనలో ఉన్నారే తప్ప, తప్పు చేస్తున్నామని అనుకోవడం లేదని... అందుకే ఒకదాని వెంట మరొకటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఆర్‌డీఏ బిల్లును ఎందుకు వ్యతిరేకించలేదో చెప్పాలి. ఆరోజు రాష్ట్ర, కేంద్ర పార్టీల ఆమోదం లేకుండానే అసెంబ్లీలో బీజేపీ మద్దతు పలికిందా?'' అని ఆయన ప్రశ్నించారు. 

read more   విశాఖలో రాజధాని వద్దా.. ఆ నలుగురితో రాజీనామా చేయించు: బాబుకు అవంతి సవాల్

''కేంద్రం దయా దాక్షిణ్యాలపై రాజధాని ఆధారపడి లేదని, ఎక్కడైనా పెట్టుకునే హక్కు రాష్ట్రానికి ఉంది. రాజధాని నిర్ణయం కేంద్రం పరిధిలో ఉండాలనే హిడెన్‌ అజెండాతో కేంద్రం ముందుకెళుతుండవచ్చు. మరోవైపు విశాఖకు రాజధానిని కాకుండా.. కరోనాను తెస్తున్నారని ఇక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు'' అని సబ్బం హరి అన్నారు. 

''జస్టిస్‌ ఈశ్వరయ్య లాంటివారితో వ్యవస్థలకే చెడ్డపేరు తెస్తున్నారు. పార్లమెంట్‌, అసెంబ్లీ, ప్రధాని, ముఖ్యమంత్రులు ఇప్పటికీ కోర్టులకు సమాధానం చెబుతున్నారని, ఆ వ్యవస్థను తీసేస్తే పాలకులను అడిగేవారుండరు. కోర్టుల డైరెక్షన్‌లోనే ఏపీలో అన్నీ జరుగుతున్నాయని, కోర్టులు దౌర్జన్యం చేస్తున్నాయనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది'' అని వ్యాఖ్యానించారు. 

''హైకోర్టులో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు జడ్జిలుగా ఉన్నారు కాబట్టి సరిపోయిందని, లేకపోతే వారికి కూడా కులాన్ని అంటగట్టేవారు. హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేసిన వ్యక్తి అదే వ్యవస్థపై ఇష్టానుసారంగా మాట్లాడడం దారుణం. ఇటువంటి వ్యక్తులు జడ్జిలు కావడం ఏమిటన్న భావన ప్రజల్లో ఉంది. జస్టిస్‌ ఈశ్వరయ్య లాంటి వ్యక్తులు ఉన్నత స్థానాలకు వెళ్లడం వల్ల ఆ వ్యవస్థలకు చెడ్డపేరు వస్తుంది'' అని సబ్బంహరి ఆరోపించారు.