Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో రాజధాని వద్దా.. ఆ నలుగురితో రాజీనామా చేయించు: బాబుకు అవంతి సవాల్

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు మంత్రి అవంతి శ్రీనివాస్. గత ఐదేళ్లలో చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమి లేదని.. ఇప్పుడేమో ముసలి కన్నీళ్లు కారుస్తున్నారని ధ్వజమెత్తారు

ap minister avanthi srinivas challenge to tdp chief chandrababu
Author
Amaravathi, First Published Aug 8, 2020, 2:37 PM IST

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు మంత్రి అవంతి శ్రీనివాస్. గత ఐదేళ్లలో చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమి లేదని.. ఇప్పుడేమో ముసలి కన్నీళ్లు కారుస్తున్నారని ధ్వజమెత్తారు.

విశాఖకు చాలా చేస్తామని చెప్పి.. ఏమీ చేయకుండానే మిగిలిపోయారని అవంతి మండిపడ్డారు. ఐదు సంవత్సరాల్లో విశాఖను పర్యాటకంగా ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని.. ఉన్న డబ్బులు అమరావతికి పెట్టి మిగిలిన పథకాలు అన్ని పక్కకు పెట్టారని ఆరోపించారు.

సీఆర్‌డీఏ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ అని వ్యాఖ్యానించారని.. చంద్రబాబు ఉదయం సింగపూర్, మధ్యాహ్నం చైనా కోసం మాట్లాడేవారని శ్రీనివాస్ గుర్తుచేశారు.

అమరావతి రైతులపై అంత ప్రేమ ఉంటే.. లోకేశ్‌ను అక్కడి ప్రజలు ఎందుకు ఓడించారో చెప్పాలని... సింహాచలం పంచగ్రామాల సమస్యను చంద్రబాబు పట్టించుకోకుండా కాలయాపన చేశారని మంత్రి మండిపడ్డారు.

సుజల స్రవంతి, స్టీల్ ప్లాంట్ గనుల సమస్య చంద్రబాబు మాటలకే పరిమితమయ్యారని.. అమరావతి రైతుల ఉద్యమంపై వైసీపీ నేతలెవ్వరూ తప్పుగా మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. అమరావతి రాజధానిగా ఉంచుతూనే విశాఖ, కర్నూలును అభివృద్ధి చేస్తామని... చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పాటుబడ్డారని అవంతి మండిపడ్డారు.

అందుకే జనం 23 సీట్లకు పరిమితం చేశారని.. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, విశాఖ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు మాట్లాడొద్దని మంత్రి హితవు పలికారు. ఒకవేళ విశాఖలో రాజధాని  వద్దనుకుంటే నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios