విశాఖపట్నం: ఉత్తరాంధ్ర రాజకీయవేత్తల్లో ఆయనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. తన వాగ్ధాటితో ఎదుట పార్టీలను చీల్చిచెండాడగల సమర్థుడిగా పేరు. కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలుగొందారు. విశాఖపట్నం మేయర్ గా, అనకాపల్లి ఎంపీగా కీలక పదవులు చేపట్టి జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 

రాష్ట్రవిభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ బయటకు వచ్చేశారు. ఆ తర్వాత వైఎస్ మరణానంతరం ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరకుండానే పలుసూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో జగన్ ను వ్యతిరేకించి బయటకు వచ్చేశారు సబ్బంహరి. 2014 ఎన్నికల్లో ఏ పార్టీ తరుపున పోటీ చెయ్యకుండా సైలెంట్ గా ఉండిపోయారు. 

అయితే 2019 ఎన్నికల్లో పోటీ చెయ్యాలని ఉవ్విళ్లూరుతున్నారు. మళ్లీ రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్లు ప్రకటించారు ఆయనే సబ్బం హరి. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో దిగుతానని స్పష్టం చేశారు. అలా ప్రకటించారో లేదో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని ఓ రేంజ్ లో పొగడటం మెుదలుపెట్టారు. 

మళ్లీ చంద్రబాబు నాయుడే సీఎం కావడం ఖాయమంటూ జోస్యం చెప్తున్నారు. ఏపీకి చంద్రబాబు మాత్రమే ఆప్షన్ అంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబును తెలంగాణ సీఎం కేసీఆర్ హెచ్చరించిన నేపథ్యంలో కూడా తెలుగుదేశం పార్టీ నేతల కంటే ముందుగా స్పందించింది కూడా సబ్బం హరే. 

చంద్రబాబు గిఫ్ట్ వల్లే కేసీఆర్ మరోసారి సీఎం అయ్యారని, కేసీఆర్ గిఫ్ట్ తో చంద్రబాబు మళ్లీ సీఎం కావడం ఖాయమని చెప్పడం అప్పట్లో రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడును సబ్బం హరి కలవడం కూడా జరిగింది. 

ఈ పరిణామాల నేపథ్యంలో సబ్బం హరి తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సబ్బం హరికి డోర్స్ క్లోజ్ చేసేసిన నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలోనే చేరాల్సిన పరిస్థితి నెలకొంది. 

ఇకపోతే సబ్బం హరి విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం లేదా అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది. ఈ రెండు లేకపోతే విజయనగరం జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ స్థానం ఇవ్వాలని కోరారట. ఇదే విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఎంపీ అవంతి శ్రీనివాస్ ఆశించారు.  

సబ్బం హరిని పార్టీలోకి తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంను అవంతికి ఇవ్వనని చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే సబ్బం హరి కోరినట్లు అనకాపల్లి ఎంపీ స్థానం కూడా ఖాళీ కాబోతుంది. 

దీంతో సబ్బం హరికి తెలుగుదేశం పార్టీలో రూట్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఆయన ఆశించిన రెండు స్థానాలు సిద్ధంగా ఉండటంతో ఇక సబ్బం హరి సైకిలెక్కడమే తరువాయి అన్నట్లు ప్రచారం జరుగుతుంది. 

మరోవైపు అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్  పార్టీవీడితే ఆ నష్టాన్ని కూడా సబ్బం హరితో భర్తీ చెయ్యాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. గురువారం ఉదయం టీడీపీ నేతల టెలీ కాన్ఫరెన్స్ లో ఓ ఎంపీ పార్టీ వీడబోతున్నారంటూ స్వయంగా చంద్రబాబు ప్రస్తావించారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. 

అంటే అవంతి శ్రీనివాస్ పార్టీ వీడటం చంద్రబాబు నాయుడు ముందే ఊహించారా...సబ్బం హరికోసమే అవంతిని లైట్ తీసుకున్నారా...లేక పొమ్మనలేక పొగబెట్టారా అన్న వార్తలు గుప్పుమంటున్నాయి విశాఖనాట.  

ఈ వార్తలు కూడా చదవండి

త్యాగానికి గంటా రెడీ: టీడీపీ నేతల టచ్ లోకి రాని అవంతి

టీడీపీకి అవంతి రాజీనామా, రేపు జగన్‌ను కలిసే అవకాశం

చంద్రబాబుకు మరో షాక్: వైసీపీలోకి అవంతి, ముహూర్తం ఖరారు

చంద్రబాబుకు మరో షాక్: వైసీపీలోకి అవంతి, ముహూర్తం ఖరారు

టీడీపీకి మరోషాక్: వైసీపీలోకి సిట్టింగ్ ఎంపీ..?