విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్రలో పార్టీకి బీటలు వారుతున్నాయా...?ఉత్తరాంధ్రలో పార్టీకి చెందిన కీలక నేత, సిట్టింగ్ ఎంపీ పార్టీ వీడుతున్నారా..? పార్టీలో ఉన్న అసంతృప్తే పార్టీ వీడటానికి  కారణమా అంటే అవుననే సమాధానం వస్తోంది. 

ఇప్పటికే వరుస షాక్ లతో ఇబ్బందులు పడుతున్న తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. కడప జిల్లాకు చెందిన రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, ఆ తర్వాత ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. 

తాజాగా అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ సైతం పార్టీ వీడతారంటూ ప్రచారం జరుగుతోంది. అవంతి శ్రీనివాస్ గత కొంతకాలంగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ నుంచి కాకుండా అసెంబ్లీకి పోటీ చెయ్యాలని భావిస్తున్నారు. 

ఈ విషయాన్ని గతంలోనే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చెవిలో పడేశారట. అందుకు అధినేత సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే గతంలో అసెంబ్లీ సీటు విషయంలో టీడీపీ అధినేత హామీ ఇచ్చినట్లు సమాచారం. గతంలో అవంతి శ్రీనివాస్ కి ఇచ్చిన హామీపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆయన అలిగారు. 

అంతేకాదు అవంతి శ్రీనివాస్ ఆశిస్తున్న భీమిలి నియోజకవర్గం మంత్రి గంటా శ్రీనివాసరావుకు మళ్లీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. అవంతి శ్రీనివాస్ సైతం భీమిలి నియోజకవర్గం నుంచే పోటీ చెయ్యాలని భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో 2009లో ప్రజారాజ్యం పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటీచేసి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 

ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చెయ్యడంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందారు. అనకాపల్లి ఎంపీగా గెలుపొందినా అవంతి మనసు మాత్రం భీమిలి నియోజకవర్గంపైనే ఉండేదని సన్నిహితులు చెప్తున్నారు. 

అనకాపల్లి ఎంపీగా కొనసాగుతున్నప్పటికీ భీమిలి నియోజవర్గంలో ఆయనకంటూ ఒక వర్గం ఉందని ఆ వర్గాన్ని అలాగే కాపాడుకుంటూ వస్తున్నారని అయితే ఆ సీటు మళ్లీ గంటా శ్రీనివాసరావుకే ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

రెండు రోజులుగా ఇన్నాళ్లుగా టీడీపీలో ఉన్నా పార్టీ ఏం చేసిందంటూ సన్నిహితుల వద్ద అవంతి ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ అసంతృప్తులపై దృష్టి సారించిన చంద్రబాబు నాయుడు అవంతి శ్రీనివాస్ ను ఎలా బుజ్జగిస్తారో అన్నది వేచి చూడాలి. 

ఇకపోతే అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని ప్రచారం జరుగుతుంది. మరోవైపు జనసేనకు చెందిన నేతలు కూడా అవంతి శ్రీనివాస్ తో టచ్ లో ఉన్నట్లు సమాచారం.