రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ నిర్వహణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) యూటెక్ సంస్థకు అప్పగించింది.
విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌పై ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ నిర్వహణ బాధ్యతను యూటెక్ సంస్థకు అప్పగించింది. రుషికొండ బీచ్‌ను టూరిస్ట్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దేందుకు.. బీచ్‌లో చెత్తచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచడం, స్నానాలు చేసే ప్రాంతంలో సముద్ర జలాలు స్వచ్ఛంగా ఉండేలా చూడడం వంటివి చేపట్టాలి. ఈ క్రమంలోనే ఏపీటీడీపీ బీచ్ నిర్వహణకు సంబందించి ఇటీవల టెండర్లు పిలిచింది.
అయితే టెండర్లలో పాల్గొన్న యుటెక్ సంస్థకు ఏపీటీడీసీ.. రుషికొండ బీచ్ నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. దీంతో ఈ నెల ప్రారంభం నుంచి యూటెక్ సంస్థ సిబ్బంది రుషికొండ బీచ్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. ఇందుకోసం టెండర్ నిబంధనల ప్రకారం.. ఆ సంస్థకు కొంతమొత్తం చెల్లించాల్సి ఉంటుందని, సిబ్బంది జీతాలను ఆ సంస్థే చూసుకుంటుందని అధికారవర్గాలు తెలిపాయి.
