యువగళం పున: ప్రారంభానికి లోకేష్ ఏర్పాట్లు: అరెస్ట్ చేస్తారా? ఉత్కంఠ
లోకేష్ ను కూడ అరెస్ట్ చేస్తారనే ప్రచారం సాగుతుంది. అయితే ఈ తరుణంలో యువగళం పాదయాత్రను పున:ప్రారంభించాలని లోకేష్ నిర్ణయం తీసుకొన్నారు.
అమరావతి: యువగళం పాదయాత్రను పున: ప్రారంభించాలని లోకేష్ నిర్ణయం తీసుకున్నారు.ఈ నెల 29వ తేదీ రాత్రి యువగళం పాదయాత్రను రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి లోకేష్ ప్రారంభించనున్నారు మరో వైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను అరెస్ట్ చేస్తారని ప్రచారం సాగుతుంది. రానున్న రోజుల్లో ఏం జరగనుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
ఈ నెల 9వ తేదీన ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో చంద్రబాబును కలిసేందుకు లోకేష్ తన పాదయాత్ర శిబిరం నుండి విజయవాడకు వచ్చారు. చంద్రబాబును జ్యుడిషీయల్ రిమాండ్ కు తరలించడంతో రాజమండ్రిలోనే లోకేష్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్ విషయమై పలు పార్టీల నేతలను కలవడంతో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసే విషయమై చర్చించేందుకు లోకేష్ న్యూఢిల్లీకి వెళ్లారు. న్యూఢిల్లీ నుండి ఆయన తిరిగి రానున్నారు.
ఈ నెల 29వ తేదీ నుండి యువగళం ప్రారంభించనున్నారు. అయితే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ ను ఏ 14గా చేర్చారు. లోకేష్ కూడ అరెస్ట్ అవుతారని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.తాను యువగళం పాదయాత్రను పున: ప్రారంభించనున్నారని ప్రకటించగానే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తన పేరును ఏ 14గా చేర్చారని లోకేష్ పేర్కొన్నారు. ఆరు మాసాల తర్వాత ఏపీ ప్రజలు జగన్ కు బుద్ది చెబుతారని లోకేష్ అభిప్రాయపడ్డారు.
also read:అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం: హెరిటేజ్ ఫుడ్స్ పై కేసు నమోదు
ఒకవేళ లోకేష్ ను అరెస్ట్ చేసినా బ్రహ్మణి పాదయాత్ర చేసే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డులో హెరిటేజ్ ఫుడ్స్ ను ఏ6 గా సీఐడీ అధికారులు చేర్చారు. దీంతో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందోననే చర్చ నెలకొంది.
చంద్రబాబు సహా ఆయన కుటుంబ సభ్యులు ఇరుక్కొనే అవకాశం ఉందా అనే అనుమానాలను టీడీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు.చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.