ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పదవ తరగతి విద్యార్థులను పరీక్షలకు లేకుండానే ప్రమోట్ చేసారు. ఫెయిల్ అయిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు లేకుండానే పాస్ చేసారు. దానితో డిగ్రీ, పీజీ విద్యార్థులను కూడా పరీక్షలను లేకుండానే ప్రమోట్ చేస్తారనే ఒక ప్రచారం  ఏపీలో ఊపందుకుంది. 

దీనిపై విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. యు జీ, పి. జీ పరీక్షలు రద్దు అనేది ఇంకా ఫైనల్ కాలేదని, కరోనా నేపథ్యంలో పరీక్షలు ఎలా నిర్వహించాలనే ఇప్పటివరకు ప్రయత్నాలు చేశామని అన్నారు.  

సాధ్యాసాధ్యాలపై అన్ని యూనివర్సిటీ ల ఉపకులపతులు, ఉన్నతాధికారులతో మాట్లాడి సూచనలు తీసుకున్నామని, అందరి నుంచి వచ్చిన అభిప్రాయాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళతానని సురేష్ అన్నారు.  

ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి గారితో చర్చించిన తరువాత ఆయన ఆదేశాల మేరకు పరీక్షలు నిర్వహించడం, రద్దు చేయటం పై తుది నిర్ణయం వెల్లడిస్తామని ఆయన అన్నారు. 

ఇకపోతే.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ నానాటికీ విజృంభిస్తోంది. చాప కింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేలు దాటింది. తాజాగా గత 24 గంటల్లో 497 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవారిలో 448 మందికి కోవిడ్ -19 పాజిటివ్ నిర్ధారణ అయింది. 

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 37 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. విదేశాల నుంచి వచ్చినవారిలో 12 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 10,331కి చేరుకుంది. 

తాజాగా గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది మంది కరోనా వైరస్ బారిన పడిన మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య129కి చేరుకుంది.  కర్నూలు జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్ాలలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మరణించారు. 

రాష్ట్రంలో 36,047 శాంపిల్స్ ను పరీక్షించగా 448 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిదార్ణ అయినట్లు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ద్వారా తెలుస్తోంది.  

గత 24 గంటల్లో అత్యధికంగా 90 కేసులు అనంతపురం జిల్లాలో నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 40, తూర్పు గోదావరి చజిల్లాో 54, గుంటూరు జిల్లాలో 39, కడప జిల్లాలో 24, కృష్ణా జిల్లాలో 36, కర్నూలు జిల్లాలో 76, నెల్లూరు జిల్లాలో 9, ప్రకాశం జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో కేసులు నమోదు కాలేదు. విశాఖపట్నం జిల్లాలో 41, విజయనగరం జిల్లాలో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 28 కేసులు నమోదయ్యాయి. 

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో ఇప్పటి వరకు మొత్తం 8306 కేసులు నమోదయ్యాయి. ఇతర దేశాల నుంచి వచ్చినవారిలో ఇప్పటి వరకు మొత్తం 364 కేసులు నమోదయ్యాయి.