అశోక్ బాబుపై దాడి

Ruckus at APNGOs office over housing society land
Highlights

గచ్చిబౌలి హౌసింగ్‌ సొసైటీ జనరల్‌ బాడీ సమావేశంలో ఘర్షణ

ఏపీ ఎన్జీవోలకు చెందిన గచ్చిబౌలి హౌసింగ్‌ సొసైటీ లిమిటెడ్‌ ఉద్యోగుల మధ్య నెలకొన్న సొసైటీ భూ వివాదం చివరకు ఒకరిపై మరొకరు చేయిచేసుకునే వెళ్లింది. గత కొన్నేళ్లుగా నలుగుతున్న ఈ వివాదంపై చర్చించేందుకు ఆదివారం గన్‌ఫౌండ్రీలోని ఏపీ ఎన్జీవోస్‌ భవనంలో గచ్చిబౌలి హౌసింగ్‌ సొసైటీ జనరల్‌ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. 

ఈ సమావేశంలో సొసైటీలో జరుగుతున్న అనేక పరిణామాలు, అవకతవకలు చర్చకు రావడంతో సభ్యులు ఒకరిపై మరొకరు ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. ఈ క్రమంలోనే ఏపీ ఎన్జీవోస్‌ అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ రెడ్డిపై కొందరు సభ్యులు దాడికి పాల్పడ్డారు. 

ఈ దాడిలో అశోక్‌ బాబు చొక్కా చిరిగిపోగా, ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ఇరు వర్గాలు అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేశాయి. మొత్తం 5,500 మంది సభ్యులు ఉన్న గచ్చిబౌలి హౌసింగ్‌ సొసైటీలో రాష్ట్ర విభజన తర్వాత 3,000 మంది ఏపీకి తరలిపోగా మరో 2,500 మంది తెలంగాణలోనే వివిధ ప్రాంతాల్లో స్థిరపడిపోయారు. 

సొసైటీలో స్థలం కేటాయింపు కోసం గతంలోనే సభ్యులు ఒక్కొక్కరు రూ.1,60,000 చొప్పున చెల్లించగా ఇంకొందరు మిగిలిన సభ్యులు రూ.30,000 చెల్లించారు. అలా ఉద్యోగుల నుంచి సేకరించిన మొత్తం రూ.34 కోట్ల వరకు జమ కాగా అందులో రూ.18 కోట్ల వరకు అభివృద్ధి కోసం ఖర్చయిందంటూ తప్పుడు లెక్కలు చూపించి అవినీతికి పాల్పడ్డారంటూ కొంతమంది సభ్యులు ప్రశ్నించారు. 

ఇదిలావుంటే స్థలాల కోసం తాము గతంలో చెల్లించిన డబ్బులను తిరిగి ఇవ్వాల్సిందిగా ఇంకొందరు సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ తారాస్థాయికి చేరి, ఘర్షణకు దారితీసినట్టు తెలుస్తోంది. 

loader