గన్నవరం: గన్నవరం ఆర్టీసీ బస్ డిపోలో పనిచేస్తున్న సూపర్ వైజర్ లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నారని మహిళా కండక్టర్లు ఫిర్యాదు చేశారు.

ఈ డిపోలో పనిచేసే మహిళా కండక్టర్ల పట్ల  ట్రాఫిక్ సూపర్ వైజర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా  ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై ఇప్పటికే నలుగురు మహిళా కండక్టర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

ఈ విషయం తెలిసిన మరో పది మంది మహిళా కండక్టర్లు కూడ సూపర్ వైజర్ పై ఫిర్యాదు చేశారు.ఈ విషయమై ఆర్టీసీ ఉన్నతాధికారులు విచారణను  ప్రారంభించారు. లైంగిక వేధింపులపై గన్నవరం ఆర్టీసీ డిపోకు చెందిన సూపర్ వైజర్ పై బాధిత మహిళలు 'దిశ' పోలీసులకు కూడ ఫిర్యాదు చేశారు.

ఈ విషయమై 'దిశ' పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడ  ఈ ఫిర్యాదులపై అంతర్గతంగా విచారణ చేస్తున్నారు.చాలా కాలంగా తమపై సూపర్ వైజర్ వేధింపులకు పాల్పడుతున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.