నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ కు కరోనా వైరస్: క్వారంటైన్ కు 35 మంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఓ ఆర్టీసీ డ్రైవర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. దీంతో 35 మందిని క్వారంటైన్ కు తరలించారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తోంది. జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతోంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఓ ఆర్టీసీ డ్రైవర్ కు కరోనా వైరస్ సోకింది. డ్రైవర్ నుంచి అతని కుటుంబ సభ్యులకు కూడా కోవిడ్ -19 వ్యాపించింది.
ఆ డ్రైవర్ విజయవాడ, నెల్లూరు మధ్య పలుమార్లు డ్యూటీ చేశాడు. డ్రైవర్ తో పాటు అతని ముగ్గురు కుటుంబ సభ్యులను ఆస్పత్రికి తరలించారు. మరో 35 మందిని క్వారంటైన్ కు తరలించారు. నెల్లూరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో కూడా కరోనా కలకలం సృష్టిస్తోంది.
నెల్లూరు దిశ పోలీసు స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న అధికారులకు, సిబ్బందికి కరోనా పరీక్షలు జరిపారు.
ఇదిలావుంటే, బాలాయపల్లి పోలీసు స్టేషన్ లో ఇద్దరు, తహశీల్దార్ కార్యాలయంలో ఐదుగురు కరోనా వైరస్ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రభుత్వాస్పత్రిలో రెండు కేసులు నమోదయ్యాయి. బుచ్చిరెడ్డి పాలెంలో ఇద్దరు బ్యాంక్ ఉద్యోగులకు కూడా కరోనా సోకింది.