ప్రయాణికులతో తిరుపతి వెళుతున్న పల్లె వెలుగు ఆర్టిసి బస్సు అదుపుతప్పి బోల్తాపడిన దుర్ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది.
తిరుపతి : ప్రయాణికులతో వెళుతున్న ఆర్టిసి బస్సు అదుపుతప్పి బోల్తాపడిన దుర్ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. సత్యవేడు నుండి తిరుపతి వెళుతున్న ఆర్టిసి బస్సు మార్గమధ్యలో అదుపుతప్పి నీటి కాలువ పక్కనే పడిపోయింది. అయితే ప్రయాణికులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఆర్టిసి అధికారులు, ప్రయాణికుల కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవాళ(సోమవారం) ఉదయం సత్యవేడు నుండి తిరుపతికి ప్రయాణికులతో పల్లె వెలుగు బస్సు బయలుదేరింది. మార్గమధ్యలో వలమాలపేట సమీపంలో బస్సు డ్రైవర్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. బిపి డౌన్ అవడంతో తలతిరిగి బస్సు అదుపుతప్పింది. ఈ పరిస్థితిలోనూ ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించాడు. దీంతో బస్సు కాలువలో పడిపోకుండా పక్కనే బోల్తా పడటంతో పెనుప్రమాదం తప్పింది.
వీడియో
ప్రమాద సమయంలో బస్సులో నిండు గర్భిణి కూడా వున్నట్లు సమాచారం.ఆమెతో పాటు చాలామంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కొంతమంది ప్రయాణికులు మాత్రం స్వల్ప గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు బస్సులోని ప్రయాణికులను బయటకు తీసి కాపాడారు. స్వల్ప గాయాలపాలైన వారిని 108 అంబులెన్స్ లో తిరుపతి, పుత్తూరు ప్రభుత్వాసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
బస్సు కాలువలో పడివుంటే భారీ ప్రాణనష్టం జరిగివుండేదని స్థానికులు చెబుతున్నారు. అస్వస్థతకు గురయి కూడా ప్రయాణికులకు ఎలాంటి అపాయం కలగకుండా చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్ పెను ప్రమాదాన్ని నివారించారు.
