శ్రీవాణి ట్రస్ట్‌పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు కురిపించారు. మన సంస్కృతి , సంప్రదాయాలను ప్రజలకు తెలియజేయాలని, ఆలయాల ద్వారా విద్యా, వైద్య సేవలను ప్రజలకు అందించాలని మోహన్ భగవత్ సూచించారు. 

ఇటీవలి కాలంలో తిరుమల శ్రీవాణి ట్రస్ట్‌ వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా పలువురు విపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. తాజాగా శ్రీవాణి ట్రస్ట్‌పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయ ఆలయాల సమావేశంలో 30 దేశాల నుంచి వచ్చిన 1600 మంది ప్రతినిధులను ఉద్దేశించి మోహన్ భగవత్ ప్రసంగించారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా సేకరించిన నిధులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలో టీటీడీ ఆలయాలు నిర్మించడంపై అభినందించారు. 

చిన్న, మధ్య స్థాయి ఆలయాలను గుర్తించి.. ఆ ఆలయ సంప్రదాయాలను, ప్రాశస్త్యాన్ని ప్రజలకు తెలియజెప్పే విధంగా ఏర్పాట్లు చేయాలని భగవత్ కోరారు. ఆలయాల ద్వారా హిందుమతం విలువలను తెలియజేయాలని ఆయన సూచించారు. మన సంస్కృతి , సంప్రదాయాలను ప్రజలకు తెలియజేయాలని, ఆలయాల ద్వారా విద్యా, వైద్య సేవలను ప్రజలకు అందించాలని మోహన్ భగవత్ సూచించారు. 

Also Read: శ్రీవాణి ట్రస్ట్‌పై ఆరోపణలు .. అవగాహన లేకనే ఇలా : విపక్షాలకు అంబటి రాంబాబు కౌంటర్

ఇకపోతే.. గత నెలలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 2018లోనే శ్రీవాణి ట్రస్టు ప్రారంభమైందని, వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019లో ట్రస్టును పునరుద్ధరించినట్టు పేర్కొన్నారు. శ్రీవాణి ట్రస్టు నిధులు ఎక్కడా దుర్వినియోగం కావడం లేదని స్పష్టం చేశారు. రూ.500, రూ.300లకు భక్తులకు రసీదు ఇవ్వడమనేది అవాస్తవమని చెప్పారు. శ్రీవాణి ట్రస్టు నిధులు వివిధ బ్యాంకుల్లో రూ.602.60 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని చెప్పారు. సేవింగ్స్ ఖాతాలో రూ.139 కోట్ల నిధులు ఉన్నాయని తెలిపారు. శ్రీవాణి ట్రస్టు నిధుల డిపాజిట్ల ద్వారా రూ.36.50 కోట్ల వడ్డీ వచ్చిందని వెల్లడించారు.

దేవాలయాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం రూ. 120.24 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, ఇతర రాష్ట్రాల్లో 127 ప్రాచీన ఆలయాలను పునరుద్ధరిస్తున్నట్టు తెలిపారు. ఈ పనుల కోసం రూ. 139 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో 2,273 ఆలయాల నిర్మాణానికి రూ. 227.30 కోట్లు కేటాయించినట్టు వివరించారు. ట్రస్ట్‌పై అనవసర ఆరోపణలు మానుకోవాలని రాజకీయ నాయకులకు హితవు పలికారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులపై ఎటువంటి అనుమానాలు ఉన్నా నేరుగా టీటీడీని సంప్రదించవచ్చని అన్నారు. ఎవరితో తనికీ చేయించుకున్నా తమకు అభ్యంతరం లేదని చెప్పారు.