మంత్రిపదవిలో ఉంటూ ఏదో ప్రోటోకల్ అందుకోవటం మినహా అఖిల చేయగలిగింది కూడా ఏమీ లేదని పార్టీ నేతలే అంటున్నారు. అఖిల పరిస్ధితి ఎలాగైపోయిందంటే ‘సింహాల మధ్య లేగదూడలా’గ తయారైందని జిల్లాలో చెప్పుకుంటున్నారు.

కొత్తమంత్రి అఖిలప్రియను చూస్తుంటే నిజంగా పాపమనిపిస్తుంది. వయస్సు తక్కువ. మొదటిసారి ఎంఎల్ఏ అవ్వగానే మంత్రి అయిపోయింది. అందరికీ తెలిసిందే కర్నూలు జిల్లా ఫ్యాక్షన్ జిల్లా అని. అందులోనూ నాగిరెడ్డికి జిల్లా అంతటా శత్రువులే. పార్టీలో ఎవరితోనూ పడదు. బయటా ఎవరితోనూ పొసగదు. కేవలం మంత్రిపదవి హామీతోనే భూమా వైసీపీ నుండి టిడిపిలోకి మారారన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ నేపధ్యంలో తాజాగా వినిపిస్తున్న మాటేమిటంటే అఖిలకు ముందుముందు అన్నీ కష్టాలేనని. ఎందుకంటే, పార్టీలోనే ఉన్న శిల్పా సోదరులతో పాడదు. కాటసాని కుటుంబంతో సఖ్యత లేదు. ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూశాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తి కుటుంబంతోనూ ఉప్పు, నిప్పే. అంటే పార్టీలోనే అఖిల మూడు బలమైన వర్గాలతో పోరాటం చేయాలి. ఇక, ప్రతిపక్ష వైసీపీతో సరేసరి. కొత్తగా ఎంఎల్సీ అయిన గంగుల ప్రభాకర్ రెడ్డి, మొన్ననే ఎంఎల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన గౌరు వెంకటరెడ్డితో కూడా ఏమాత్రం భూమాకు పడదు. అంటే తండ్రితో పై వర్గాలకున్న బద్ద వైరాన్ని ఇపుడు మంత్రి కూడా ఎదుర్కోవాలి.

పార్టీలోని వైరి వర్గ నేతలందరూ బాగా సీనియర్లే. ఎవరూ ఎవరి మాటా వినేవారు కాదు. స్వయంగా చంద్రబాబు పంచాయితీలు చేస్తే కూడా భూమా నాగిరెడ్డితో సఖ్యత సాధ్యం కాలేదు. అటువంటిది అఖిలను ఎందుకు లెక్క చేస్తారు? టిడిపిలో చేరిన తర్వాత కూడా ప్రత్యర్ధి వర్గాలు భూమాకు ఏమాత్రం ఊపిరిఆడనివ్వలేదు. ఎక్కడికక్కడ భూమా ఆర్ధికవ్యవహారాలను బిగించేసారు. తల్లి,తండ్రులున్నపుడు కానీ తల్లి స్ధానంలో ఎంఎల్ఏ అయినా అఖిల రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించినట్లు కనబడలేదు. స్వతంత్రించి నిర్ణయాలు తీసుకున్నదీ లేదు.

హటాత్తుగా తండ్రి పోవటంతో తప్పని పరిస్ధితుల్లోనూ అఖిలప్రియకు చంద్రబాబు మంత్రిపదవి ఇచ్చారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఉండటానికి మేనమామ ఎస్వీ మోహన్ రెడ్డి ఉన్నా ప్రత్యర్ధులను సమర్ధవంతంగా ఢీకొన్న నేపధ్యం లేదు. ప్రత్యర్ధులందరూ అవసరమైతే చంద్రబాబునే ఢీకొనగలిగిన వారు. అటువంటిది అఖిలను లెక్కచేస్తారనుకోవటం భ్రమే. మంత్రిపదవిలో ఉంటూ ఏదో ప్రోటోకల్ అందుకోవటం మినహా అఖిల చేయగలిగింది కూడా ఏమీ లేదని పార్టీ నేతలే అంటున్నారు. అఖిల పరిస్ధితి ఎలాగైపోయిందంటే ‘సింహాల మధ్య లేగదూడలా’గ తయారైందని జిల్లాలో చెప్పుకుంటున్నారు.