ప్రతిభకు కులం లేదు, పేదరికం లేదు. ప్రాంతమూ లేదు. మనిషిలో ఎదగాలనే కసి, తపన ఉండాలే గానీ ఏదీ అడ్డురాదు అని చెప్పేందుకు ఉదాహరణే రోణంకి గోపాలకృష్ణ. తల్లీ, తండ్రీ నిరక్ష్యరాస్యులు పైగా వ్యవసాయ కూలీలు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస మండలంలోని మారుమాల గ్రామం పారసంబ. వీథిబడిలోనే ప్రాధమిక విద్యాభ్యాసం. ఇంటర్ దాకా తెలుగు మీడియం… డిగ్రీ చేసింది ఆంధ్రా యూనివర్శిటీ దూరవిద్యలో.  

 ఉపాధ్యాయ శిక్షణ పొందాక 2007లో టీచర్ అయ్యాడు. అదే మండలంలోని రేగులపాడులో సర్కారీ టీచర్. టీచర్ గా చేరినప్పటి నుండి సివిల్స్ ర్యాంకు సాధించలన్న పోరాటాన్ని మొదలుపెట్టాడు. 2012లో గ్రూపు-1 ఇంటర్వ్యూల దాకా వెళ్లాడు. అయితే 2016 పరీక్షల్లో చివరకు లక్ష్యాన్ని అందుకున్నాడు. అదీ జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు.  

సర్కారు బడిలో చదివే రోజుల్లో ఆ ఊరికి అసలు కరెంటే లేదు. గుడ్డి దీపాలే గతి. అయినా తన లక్ష్యాన్ని, కసిని వదల్లేదు. సివిల్స్ పరీక్షల్లో తెలుగునే మెయిన్ సబ్జెక్టుగా ఎంచుకున్నాడు.  తెలుగు లిటరేచర్ ఆప్షనల్. తెలుగులో ఇంటర్వ్యూ. ప్రాధమిక పాఠశాల నుండి సివిల్స్ మెయిన్స్ వరకు కూడా ఎక్కడా తెలుగును వదల్లేదు. అయినా పపదకొండేళ్ల పోరాటంలో విజయం సాధించారు.  

అప్పుడెప్పుడో 25 ఏళ్ల క్రితం తండ్రి ఓ నిమ్నకులస్తుడి ఇంట్లో భోంచేసినందుకు చుట్టాలు, ఊరి వాళ్ళు దాదాపు వెలివేశారు. అదో అప్రకటిత శిక్ష.  ఆ శిక్షే రోణంకిలో కసిని పెంచింది. తమ కుటుంబాన్ని శిక్షించిన సమాజాన్ని ర్యాంకు తెచ్చుకోవటం ద్వారా మార్చాలన్న ఆలోచన రోణంకిలో పురుడుపోసుకుంది. అందుకే మిగిలిన వారు కష్టపడో, ఇష్టపడో చదివితే, రోణంకి మాత్రం కసితో చదివాడు, ర్యాంకు సాధించాడు. అది కూడా ప్రాధమిక పాఠశాల నుండి ఉన్నత విద్య వరుకూ తెలుగుమీడియంలో చదివే.