చిత్తూరు:  టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌‌పై టీడీపీలో ఉన్న సమయంలో  రోజా తీవ్ర విమర్శలు చేశారు.కాంచీపురం వెళ్తున్న కేసీఆర్‌కు రోజా నగరిలో ఘనంగా సోమవారం నాడు  స్వాగతం పలికారు.

టీడీపీలో ఉన్న సమయంలో రోజా ప్రత్యర్ధులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్, ఏపీలో వైఎస్ఆర్‌సీపీ నుండి టీడీపీకి విపరీతమైన పోటీ ఉండేది.

తెలంగాణలో టీడీపీని దెబ్బతీసేందుకుగాను టీఆర్ఎస్ నేతలు టీడీపీపై విమర్శలు చేసేవారు. ఈ సమయంలోనే టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌పై టీడీపీ నేతగా రోజా తీవ్ర విమర్శలు చేశారు.

రాత్రి బార్ ఉదయం దర్బార్ అంటూ రోజా ఆనాడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ విమర్శలు అప్పట్లో  తీవ్ర సంచలనానికి కారణమయ్యాయి. ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో అనేక మార్పులు చోటు చేసుకొన్నాయి. 2009 ఎన్నికల్లో నగరి నుండి రోజాకు టీడీపీ టిక్కెట్టు దక్కలేదు. ఈ స్థానం నుండి  దివంగత గాలి ముద్దుకృష్ణమనాయుడు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించాడు.

2009లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి వరుసగా  ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కారు.  వైఎస్ఆర్ చనిపోవడానికి రెండు రోజుల ముందు రోజా ఆయనను కలిశారు. కాంగ్రెస్ లో చేరాలని ఆమె నిర్ణయం తీసుకొన్నారు. అప్పటి నుండి ఆమె వైఎస్ కుటుంబంతో ఉంటున్నారు.

వైఎస్ఆర్ మరణించిన తర్వాత ఆమె కాంగ్రెస్ తో ఉన్నారు. జగన్ వైఎస్ఆర్‌సీపీని ఏర్పాటు చేసిన తర్వాత ఆమె ఆ పార్టీలో చేరారు.2014, 2019 ఎన్నికల్లో రోజా వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా రెండు సార్లు గెలుపొందారు.

వైఎస్ఆర్‌సీపీ, టీఆర్ఎస్ ల మద్య కూడ సన్నిహిత సంబంధాలున్నాయి. గతంలో కేసీఆర్ తిరుపతికి వచ్చిన సమయంలో వైఎస్ఆర్‌సీపీకి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ఆయనకు స్వాగతం పలికారు.కానీ ఆ సమయంలో రోజా రాలేదు.

సోమవారం నాడు కేసీఆర్ కాంచీపురంలో అత్తి వరద రాజస్వామిని దర్శించుకొనేందుకు వెళ్లారు.ఆ సమయంలో నగరిలో రోజా రోడ్డుపై నిలబడి కేసీఆర్ కోసం ఎదురుచూశారు. కేసీఆర్ కాన్వాయ్ ను ఆపి రోజాతో కొద్దిసేపు మాట్లాడారు.కేసీఆర్ వెంటే రోజా కూడ అత్తి వరద రాజస్వామిని దర్శించుకొన్నారు.

టీడీపీలో ఉన్న సమయంలో కేసీఆర్ పై నిప్పులు చెరిగిన రోజా నవ్వుతూ కేసీఆర్ ను పలకరించారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ, శాశ్వత మిత్రులు కానీ ఉండరని ఈ ఘటన మరోసారి రుజువు చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

కంచిలో కేసీఆర్ ప్రత్యేక పూజలు

నగరిలో కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే రోజా

కేసీఆర్‌‌ కు రోజా ఘన స్వాగతం(వీడియో)

కొద్దిసేపట్లో ఎమ్మెల్యే రోజా ఇంటికి కేసీఆర్.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ