Roja: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఓటు వేసినందుకు ప్ర‌జ‌లు త‌ల‌దించుకుంటున్నార‌ని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. అలాగే మెడికల్ కాలేజీలపై ఆమె కూటమి మంత్రులకు సవాల్ విసిరారు. ఇంతకీ రోజా ఏం మాట్లాడారంటే..? 

పవన్ కళ్యాణ్‌పై రోజా తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఆర్కే రోజా కూటమి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ప్రజలు ఓట్లు వేసింది సమస్యలు పరిష్కరించమని కానీ షూటింగ్‌లు చేసుకోవడానికేనా? అని రోజా ప్రశ్నించారు. ప్రభుత్వ డబ్బుతో విమానాల్లో తిరగడం, ప్యాకేజీలతో కాలం గడపడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌కి ఓట్లు వేసినందుకు ప్రజలు తలదించుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

"ప్రజల సమస్యలపై మౌనం" – రోజా

రాష్ట్రంలో రైతులు యూరియా కోసం కష్టపడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పరిష్కారాలు చూపలేకపోతున్నార‌న్నారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ రాష్ట్ర సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజలు ఆశలు పెట్టుకుని ఓట్లు వేసినా ఆయనకు అవి పట్టవని రోజా విమర్శించారు.

మెడికల్ కాలేజీలపై సవాల్

ఆర్కే రోజా కూటమి మంత్రులను సవాల్ విసిరారు. "దమ్ముంటే మంత్రులు నా వెంట రండి, నేను చూపిస్తాను – జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన మెడికల్ కాలేజీలు ఇప్పుడు నడుస్తున్నాయి" అని రోజా అన్నారు. జగన్ మొదటిసారి సీఎం అయ్యాక 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఆమోదించి, వాటిలో ఆరు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కానీ చంద్రబాబు మూడు సార్లు సీఎం అయినా ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేదని ఆరోపించారు.

అనిత, సవితపై విమర్శలు

హోం మంత్రి అనిత, మంత్రి సవితపై కూడా రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. "మహిళల భద్రతపై ఎన్నడూ స్పందించని అనిత ఇప్పుడు జగన్‌పై ఫేక్ వీడియోలు చూపిస్తూ ఆరోపణలు చేస్తున్నారు. సవిత ప్రవర్తన కొత్త పిచ్చోడు పొద్దు ఎరుగడు అన్నట్టుగా ఉంది" అని రోజా వ్యాఖ్యానించారు. తమ ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలను పూర్తి చేయడంలో వీరు విఫలమయ్యారని ఆమె అన్నారు.

"చంద్రబాబు అభివృద్ధి శూన్యం"

చంద్రబాబు నాయుడు చేసిన పనుల గురించి కూడా రోజా విమర్శించారు. ఆయనకు అభివృద్ధి దిశగా విజన్ లేకుండా కేవలం అబద్ధాలే ఆధారమని అన్నారు. "ఐదువేల కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేకపోతున్నారు. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదని చెబుతున్నారు.. మరి పీపీపీ అంటే రౌడీ షీటర్ల పెరోలా?" అంటూ ప్రశ్నించారు.