లోకేష్ పై రోజా సెటైర్

చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్... కామెడీ ఆర్టిస్ట్ కు ఎక్కువ, కామెడీ విలన్ కు తక్కువ అని వైఎస్సార్ సీపీ నాయకురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. ఏపీలో ప్రతిపక్షమే లేదని వ్యాఖ్యానించడం అతని అమాయకత్వానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకే ప్రత్యేక హోదాను ఏపీ సీఎం చంద్రబాబు తాకట్టు పెట్టారని ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకెళుతున్న బాబును ప్రజలు చొక్కపట్టుకుని నిలదీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వైఎస్‌ఆర్‌ సీపీ నిర‍్వహిస్తున్న జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.
దగా పడ్డ తెలుగువాడి పౌరుషాన్ని చాటి చెప్పేందుకే ప్రత్యేక హోదా ఉద్యమం చేపట్టామన్నారు. శ్రీశ్రీ, గురజాడ, తెన్నేటి నడయాడిన ఉద్యమాల పురిటిగడ్డ ఉత్తరాంధ్రలో జై ఆంధ్రప్రదేశ్ సభలో ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. అధికార మదంతో తెలుగు ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబుకు బుద్ధిచెప్పేందుకు ఈ సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ రెండున్నరేళ్లుగా పోరాడుతున్నారని.. ధర్నాలు, బంద్ చేపట్టారని తెలిపారు. ప్రాణాలు లెక్కచేయకుండా ఆమరణ దీక్షలు చేశారని చెప్పారు. ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయన్నారు.

జై ఆంధ్రప్రదేశ్ సభతో అధికార పార్టీ నేతలు వణికి పోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ ప్రకటించారని, టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తారా అని చంద్రబాబును ప్రశ్నించారు. కనీసం వైఎస్సార్ సీపీ నుంచి ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలిపించుకునే ధైర్యం ఉందా నిలదీశారు. ప్రత్యేక హోదా కావాలంటే ప్రతి ఒక్కరు జగనన్న వెంట నడవాలని కోరారు