చిత్తూరు జిల్లాలో జనాలందరూ సిగ్గుపడుతున్నారట. ఎందుకంట? అంటే, తాము పుట్టిన జిల్లాలోనే చంద్రబాబునాయుడు కూడా పుట్టినందుకట. చంద్రబాబును ఉద్దేశించి వైసిపి ఎంఎల్ఏ రోజా చేసిన తాజా వ్యాఖ్యలివి. 

చంద్రబాబుపై వైసిపి ఎంఎల్ఏ రోజా మండిపడ్డారు. మంగళవారం వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. నగిరి అంటే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పథకాలపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు.

సిఎం గురించి మాట్లాడుతూ, చిత్తూరు జిల్లాకు చంద్రబాబు చేసింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చిత్తూరు జిల్లాలో పుట్టినందుకు అందరం సిగ్గుపడుతున్నామన్నారు. బాబు పుణ్యమా అని ఇక్కడి చక్కెర ఫ్యాక్టరీలు మూత వేయించినట్లు ధ్వజమెత్తారు. జన్మభూమి కమిటీల పేరుతో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు.

చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన 600 హామీలు తుంగలో తొక్కారన్నారు. అన్ని వర్గాల ప్రజలు తనపై పీకల దాకా కోపంతో ఉన్న విషయం గ్రహించే ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబు ఇళ్ళు మంజూరు చేస్తున్నట్లు మండిపడ్డారు. అది కూడా తెలుగు తమ్ముళ్లకు మాత్రమే ఇస్తున్నట్లు ధ్వజమెత్తారు.

మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగా వైఎస్‌ జగన్‌ కూడా నవరత్నాల ద్వారా అన్ని వర్గాలకు భరోసా కల్పిస్తున్నట్లు చెప్పారు. వైఎస్‌ఆర్‌ కుటుంబం ఒక్క మాట ఇస్తే మడమ తిప్పరని ప్రజల్లో నమ్మకముందన్నారు. పిల్లలను చదవించే బాధ్యత  జగన్‌ తీసుకుంటారని రోజా అన్నారు. మద్యం వల్ల చాలా కుటుంబాలు నాశనమవుతున్నాయన్నారు. ఎక్కడపడితే అక్కడ చంద్రబాబు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారంటూ రోజా విమర్శించారు.