చిత్తూరు: మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడి అరెస్టుపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపీ) ఎమ్మెల్యే రోజా స్పందించారు. తప్పు చేశారని రుజువైంది కాబట్టే అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారని ఆమె అన్నారు. ఆధారాలతో సహా అరెస్టు చేస్తే కిడ్నాప్ చేశారని చంద్రబాబు అంటున్నారని, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని రోజా అన్నారు. 

తాము ఎవరినీ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగినట్లు ప్రతి అసెంబ్లీ సెషన్ లోనూ వైఎస్ జగన్ లెక్కలతో సహా నిరూపించారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగితే నిరూపించాలని గంతలోనే నారా లోకేష్ ఓ ప్రెస్ మీట్ లో అన్నారని ఆమె గుర్తు చేశారు. 

Also Read:అన్ని బయటకొస్తే.. అచ్చెన్నాయుడే కాదు బాబు, లోకేశ్‌లూ ఊచలు లెక్కెట్టాల్సిందే: జోగి రమేశ్

ఇప్పుడు అదే నిరూపిస్తున్నామని, అచ్చెన్నాయుడి అరెస్టు కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని రోజా అన్నారు. రాజధాని భూముల్లో అక్రమాలు, ఫైబర్ గ్రిడ్, చంద్రన్న కానుకలలో జరిగిన అక్రమాలు కచ్చితం్గా బయటకు వస్తాయని, వాటిని బయటకు తెస్తామని ఆమె అన్నారు. తప్పు చేిసన వ్యక్తి బీసీ అయినా, ఓసీ అయినా ఎవరైనా తప్పకుండా జైలుకు పంపిస్తామని రోజా అన్నారు. 

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అచ్చెనాయుడిని పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో ఆయనను అరెస్టు చేశారు. ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆ కుంభకోణం జరిగినట్లు అధికారులు గుర్తించారు. 

Also Read: అచ్చెన్నాయుడు అరెస్ట్.. సమర్థించిన కన్నా లక్ష్మీనారాయణ

అచ్చెన్నాయుడు సిఫార్సుల కారణంగానే అక్రమాలు జరిగినట్లు దర్యాప్తులో నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ (టీడీఎల్పీ) ఉప నేతగా ఆయన ఉన్నారు. శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అచ్చెన్నాయుడి అరెస్టు జరిగింది.