రోజా మానవత్వం చాటుకున్నారు ప్రమాదానికి గురైన మహిళను ఆసుపత్రికి తరలించారు

ప్రమాదంలో ఉన్న మహిళను సకాలంలో కాపాడి సినీనటి, వైసీపీ శాసనసభ్యురాలు ఆర్కె రోజా మానవత్వాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శుక్రవారం ఉదయం తిరుపతి నుండి చిత్తూరులో జరగాల్సిన జడ్పి సమావేశానికి రోజా తన వాహనంలో బయలుదేరారు.

అయితే, చంద్రగిరి దాటిన తర్వాత నేండ్రగుంట వద్ద రోడ్డుపై అపస్మారక స్ధితిలో పడిపోయిన ఒక మహిళ కనబడింది. స్కూటిపై చిత్తూరు నుండి తిరుపతికి బయలుదేరిన మహిళను గుర్తు తెలీని వాహనం ఢీ కొట్టినట్లు గ్రహించిన రోజా వెంటనే సదరు మహిళను తన కారులో ఎక్కించుకుని సమీపానే ఉన్న పూతలపట్టు ఆసుపత్రికి తరలించారు.

 వైద్యులు కూడా వెంటనే స్పందించి గాయాలపాలైన మహిళకు అత్యవసర వైద్యం అందించారు. దాంతో మహిళకు ప్రాణాపాయం తప్పింది. ఇంతలో విషయం తెలుసుకున్న మహిళ తల్లి, దండ్రులు పూతలపట్టుకు చేరుకున్నారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని స్విమ్స్ కు తరలించారు. సకాలంలో స్పందించి మహిళను ఆదుకున్నందుకు అందరూ రోజాను అభినందిస్తున్నారు.