దోపిడీ కేసులో ట్విస్ట్: పెళ్లయిన పది రోజులకే భర్తను చంపించిన భార్య

దోపిడీ కేసులో ట్విస్ట్: పెళ్లయిన పది రోజులకే భర్తను చంపించిన భార్య

విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఓ దోపిడీ కేసు అనూహ్యమైన మలుపు తీసుకుంది. భార్యనే దోపిడీ డ్రామా ఆడి భర్తను చంపించినట్లు తేలింది. వివాహమైన పది రోజులకే ఈ సంఘటన జరిగింది. 

భార్యాభర్తలు శంకరరావు, సరస్వతి బైక్ పై వెళ్తుండగా ముగ్గురు దొంగలు దాడి చేశారు. ఈ దాడిలో శంకరరావు అక్కడికక్కడే మరణించగా, సరస్వతి గాయపడింది. విజయనగరం జిల్లా గురుగుబిల్లి మండలం తోటపల్లి రిజర్యాయర్ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయం వెలుగు చూసింది. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కడకెళ్ల గ్రామానికి చెందిన సరస్వతికి అదే మండలం చిట్టిపుడివలస గ్రామానికి చెందిన యామక గౌరీశంకరరావు (25)తో గత నెల 28వ తేదీన పెళ్లయింది.

బైక్ ను సర్వీసింగ్ కు ఇచ్చేందుకంటూ దంపతులు సోమవారం పార్వతీపురం వచ్చారు. సర్వీసింగ్ పూర్తి చేసుకుని రాత్రి 7.30 గంటలకు బయలుదేరి తోటపల్లి సమీపంలోని ఐటిడిఎ పార్కు వద్ద లఘుశంక తీర్చుకునేందుకు ఆగారు. ఇంతలో ముగ్గురు వ్యక్తులు వచ్చి వారిపై దాడి చేశారు. 

గౌరీశంకర రావును దుండగులు తలపై ఇనుప రాడ్ తో బలంగా కొట్టారు. దాంతో అతను మరణించాడు. సరస్వతి మెడలో ని దాదాపు 6 తులాల ఆభరణాలను దోచుకుని వెళ్లారు. తనకు ఏమీ తెలియనట్లుగా సరస్వతి విలపించసాగింది. దాడి గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

అయితే, తన మిత్రులు, రౌడీషీటర్లతో పథకం వేసి సరస్వతే డ్రామా ఆడి భర్తను చంపించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు విషయం తెలిసింది. ఇష్టం లేని పెళ్లి కారణంగానే సరస్వతి శంకరరావును హత్య చేయించినట్లు తెలిసింది. శంకరరావు ఆమెకు మేనబావ అవుతాడని సమాచారం.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos