పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో అచ్చు సినీ ఫక్కీలో జరిగిన ఓ వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది. ఆ వ్యాపారిని  కారులో కిడ్నాప్‌ చేసిన దుండగులు అతని నుంచి భారీగా నగదు, బంగారు ఆభరణాలు దొంగిలించి, అతన్ని గుంటూరు జిల్లా కాజ టోల్‌గేట్‌ వద్ద విడిచి పరారయ్యారు. వివరాల్లోకి వెడితే.. 

దూబచర్లకు చెందిన కలగర రామకృష్ణ నల్లజర్లలో సూర్య రెడీమెడ్‌ షాపు నడుపుతున్నాడు. రోజూలాగే బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో షాపు మూసి స్కూటీపై ఇంటికి బయలుదేరాడు. పుల్లలపాడు వీరమ్మ చెరువు దగ్గరికి వచ్చేసరికి ఓ ఇన్నోవా కారు వచ్చి ఆగింది. అందులో వెళుతున్న గుర్తు తెలియని వ్యక్తులు ద్వారకాతిరుమలకు ఎటువెళ్లాలంటూ అడిగారు. రామకృష్ణ చెబుతుండగానే కారులోనుండి దిగిన వ్యక్తి అతని స్కూటీ లాక్కోగా మరో ముగ్గురు అతని నోరునొక్కి కారులోకి బలవంతంగా ఎక్కించారు. 

వ్యాపారి బ్యాగులో ఉన్న రూ.1 లక్షా 35 వేల నగదు, 28 గ్రాముల రెండు బంగారు ఉంగరాలు, సెల్‌ఫోన్, మూడు ఏటీఎం కార్డులు లాక్కున్నారు. పిన్‌ నంబర్‌ కూడా తీసుకున్నారు.  ఇదంతా కారులో తిప్పుతూనే చేశారు. గుండుగొలను జంక్షన్‌లో మరో ఇద్దరు కారులో ఎక్కారు. ఆ తరువాత దూబచర్ల, కైకరం, భీమడోలు చుట్టూ మూడు సార్లు తిప్పారు. అరిస్తే చంపేస్తామంటూ బెదిరించారు.  రాడ్డుతో ముఖంపై కొట్టారు. 

తెల్లవారుఝామున మూడు గంటల సమయంలో గుంటూరు జిల్లా కాజ టోల్‌గేట్‌ సమీపంలో కారు ఆపి రామకృష్ణను దింపి దుండగులు పరారయ్యారు. రామకృష్ణ ఎలాగో తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. 

గురువారం ఉదయం నల్లజర్ల పోలీసులకు ఘటనపై ఫిర్యాదు చేశారు. తాడేపల్లిగూడెం రూరల్‌ సీఐ రవికుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, గురువారం మధ్యాహ్నం రామకృష్ణ ఏటీఎం కార్డు నుంచి ఒంగోలులో దుస్తులు కొనుగోలు చేసినట్లు అతని సెల్‌ఫోన్‌కు సమాచారం రావడంతో ఈ దిశగా పోలీసులు ఆరా తీస్తున్నారు.