అనంతపురం జిల్లా మడకశిరలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. గురువారం ఉదయం జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. అక్టోబర్ నెల మొదటి రోజు కావడంతో పింఛన్లు పంపిణీ చేసేందుకు వెల్తున్న వలంటీర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు.

వాలంటీర్ వీరప్ప దగ్గరున్న డబ్బులు లాక్కుని, కళ్లలో కారం కొట్టి వెళ్లారు. వీరప్ప దగ్గర ఆ సమయంలో వీరప్ప దగ్గరున్న 43 వేల రూపాయలు దుండగుల పాలయ్యింది. 

మడకశిర పట్టణంలోని శివపురలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. దుండ‌గుల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. 

వీరప్ప కార్యకలాపాలు తెలిసినవారే పక్కాగా ప్లాన్ తో ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.  వెంటనే దొంగలను పట్టుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

వృద్ధులకిచ్చే ఆసరా పింఛన్ల పంపిణీ సమయంలో ఈ దోపిడీ జరగడంతో స్థానికులు మండిపడుతున్నారు. ముసలివారి కడుపుకొట్టడానికి ఆ దొంగలకు మనసెలా వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వెంటనే దొంగలను పట్టుకుని వృద్ధులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా ఈ దోపిడి నేపథ్యంలో వాలంటీర్లు జాగ్రత్తగా ఉండాలని, డబ్బులు క్యారీ చేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.