ఐతవరం వద్ద హైద్రాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై మున్నేరు వరద: వాహనాల మళ్లింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐతవరం వద్ద హైద్రాబాద్- విజయవాడ రహదారిపై మున్నేరు నది పోటెత్తింది. దీంతో వాహనాల రాకపోకలను మళ్లించారు.
కోదాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐతవరం వద్ద హైద్రాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మున్నేరు నది వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో ఈ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను మళ్లించారు అధికారులు. తెలంగాణ రాష్ట్రంలోని కోదాడ మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాహనాలను మళ్లించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా గుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిడుగురాళ్ల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వాహనాలను పంపుతున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. దాదాపు వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు మున్నేరు నదికి వరద పోటెత్తింది . ఈ నెల 26వ తేదీ రాత్రి మున్నేరు ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి.
మున్నేరు దిగువన కూడ ఇదే స్థాయిలో వర్షాలు కురిశాయి. దీంతో మున్నేరుకు వరద పోటెత్తింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెనుగంచిప్రోలు వద్ద రెండు బ్రిడ్జిలపై నుండి మున్నేరు వరద పోటెత్తింది. దీంతో ఖమ్మం జిల్లా నుండి జగ్గయ్యపేటకు, జగ్గయ్యపేట నుండి ఖమ్మం వైపు వెళ్లే వాహనాలను నిలిపివేశారు. మరోవైపు జాతీయ రహదారిపై ఐతవరం వద్ద మున్నేరు వాగుపై వరద పోటెత్తిన కారణంగా ఈ రోడ్డుపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు.