తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి

Road Accident in East Godavari district
Highlights

తొమ్మిది మందికి తీవ్ర గాయాలు...
 

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికుల ఆటోను ఓ టిప్పర్ లారీ ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.  ఇవాళ తెల్లవారుజామున ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వెళుతుండగా వీరు ప్రయాణిస్తున్న ఆటోని ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది.  దీంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... పెదపూడి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన కొందరు పెద్దాపురం మండలం వడ్లమూరులోని బంధువుల ఇంట్లో ఓ శుభకార్యానికి హాజరయ్యారు. అనంతరం తెల్లవారుజామున 4 గంటల సమయంలో తిరిగి తమ స్వగ్రామానికి ఓ ఆటోలో బయలుదేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న ఆటో సామర్లకోట సాంబమూర్తి రిజర్వాయర్ వద్ద ప్రమాదానికి గురయ్యింది. ఆటోను టిప్పర్ లారీ ఢీకొనడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ జోగేంద్ర తో పాటు మూడేళ్ల బాలుడు పండు, మహిళలు నాగమణి(35), మంగ(36), లక్ష్మి(35), కమల(35)లు మృతి చెందారు. క్షతగాత్రుల్లో కూడా మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదంపై హోంమంత్రి చినరాజప్ప దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు మంతి ఆదేశించారు. అలాగే మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
 

loader