చిత్తూరు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి భాకరాపేటలో చోటుచేసుకున్న బస్సు ప్రమాదం మరవక ముందే.. చంద్రగిరి మండలంలో ట్రాక్టర్ ఢీకొని మినీ వ్యాన్ బోల్తా పడింది.
చిత్తూరు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి భాకరాపేటలో చోటుచేసుకున్న బస్సు ప్రమాదం మరవక ముందే.. చంద్రగిరి మండలం ఐతేపల్లిలో ట్రాక్టర్ ఢీకొని మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులను 108 వాహనంలో తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. బాధితులు నిశ్చితార్థానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగితెలుసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
చిత్తూరు జిల్లాలోని భాకరాపేట ఘాట్ రోడ్డు వద్ద శనివారం రాత్రి బస్సు లోయలో పడిన ఘటనలో 8 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో పెద్దలు వివాహం నిశ్చయమయ్యింది. ఈ క్రమంలోనే ఇవాళ(ఆదివారం) తిరుచానూరులో నిశ్చితార్థం ఏర్పాటు చేసారు. ఇందుకోసం వేణు కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల ఓ ప్రైవేట్ బస్సులో చిత్తూరుకు బయలుదేరారు.
అయి వీరు ప్రయాణిస్తున్న బస్సు చిత్తూరు జిల్లాలో భాకరావుపేట ఘాట్ రోడ్డుపై వెళుతుండగా దొనకోటి గంగమ్మ దేవాలయం సమీపంలో ప్రమాదానికి గురయ్యింది. ఓ మలుపు వద్ద ఒక్కసారిగా బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. వేగంగా వెళుతుండగా ఒక్కసారిగా మలుపు రావడంతో డ్రైవర్ బస్సును అదుపు చేయలేకపోయాడు. దీంతో ఒక్కసారిగా బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతిచెందగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతిచెందారు.
ప్రమాదం జరిగిన సమయంలో పెళ్లి కుమారుడు సహా బస్సులో 52 మంది ప్రయాణిస్తున్నారు. ఆరుగురు ఘటన స్థలంలోనే మృతిచెందగా... రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు, నారావారిపల్లి పీహెచ్‌సీలో చికిత్స పొందుతూ ఓ చిన్నారి మృతిచెందారు. పెళ్లి కుమారుడు వేణుతో సహా 44 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రుయా ఆస్పత్రిలో 31 మంది బాధితులు, స్విమ్స్‌లో ఏడుగురు, బర్డ్ ఆస్పత్రిలో మరో ఆరుగురికి చికిత్స పొందుతున్నారు.
ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
