శ్రీశైలం ఘాటు రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా ఈగల పెంట శ్రీశైలం ఘాట్ రోడ్డులో మంగళవారం రాత్రి ఓ వ్యాన్ లోయలోపడింది. ఈ ఘటనలో వ్యాన్ లో ప్రయాణిస్తున్న 9మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారంతా ఒకే కుటంబానికి చెందిన వారు కావడం గమనార్హం.

హైదరాబాద్ ధూల్ పేటలోని ఒకే కుటుంబానికి చెందిన 9మంది క్వాలీస్ వాహనంలో శ్రీశైలం బయలుదేరారు. కాగా.. ఈగల పెంట సమీపంలో మైసమ్మగుడి మొదటి మలుపువద్ద వాహనం అదుపుతప్పి 50 అడుగల లోయలో పడిపోయింది. దీంతో.. వాహనంలో ఉన్నవారంతా తీవ్రంగా గాయపడ్డారు. 

క్షతగాత్రులను మూడు అంబులెన్స్‌లో ఈగలపెంట జెన్‌కో ఆస్పత్రికి తరలించారు. వీరిలో నీతూ సింగ్‌ (40), రాజకుమారి (55), ధర్మిక్‌ (8) పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు. మిగతావారిని కూడా ఈగలపెంటలో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. అతివేగం, డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు