శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న లారీని అతివేగంగా వెళుతున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఇద్దరు క్షతగాత్రుల పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు సమాచారం. 

జిల్లాలోని లావేరు మండలం తాళ్ళవలస గ్రామ సమీపంలో 16 వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపక్కన ఆగివున్న ఐచర్ వ్యాన్ ను హైవేపై వేగంగా వచ్చిన ఆల్టో కారు అదుపుతప్పి ఢీ కొట్టింది. కారు వేగం అధికంగా వుండటంతో వ్యాన్ కిందకు చొచ్చుకెళ్లింది. దీంతో డ్రైవర్ తో పాటు ముందుసీట్లో వున్న వ్యక్తులు మృతిచెందారు.

కారులో వెనకవైపు కూర్చున్న ఇద్దరికి కూడా తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన వెంటనే స్థానికులు పోలీసులు సమాచారం అందించగా వారు వేగంగా స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముందుగా క్షతగాత్రులను కారులోంచి బయటకు తీసి దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. ఆ తర్వాత మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.