అనుకున్నట్లుగానే తమిళనాడులోని ఆర్ కె నగర్ ఉప ఎన్నిక రద్దైంది. ఉప ఎన్నికలో డబ్బు ప్రభావం బాగా ఎక్కువైపోయిందన్న ఆరోపణలు రావటంతో పాటు అందుకు తగ్గ ఆధారాలు కూడా లభించటంతో ఎన్నికల ప్రధానాధికారి ఎన్నికను రద్దు చేసారు. అయితే, మళ్ళీ ఎన్నికను ఎప్పుడు నిర్వహించేది చెప్పలేదు. ఏఐఏడిఎంకెలోని శశికళ వర్గానికి చెందిన టిటివి దినకరన్ తరపున డబ్బులు పంచుతున్నట్లు స్వయంగా ఓ మంత్రిపైనే ఆరోపణలు రావటం గమనార్హం. అధికారంలో ఉన్నారు కాబట్టి డబ్బు కొదవేముంటుంది? పైగా ఎన్నికల్లో గెలవటం ప్రిస్టేజ్ కూడా.

ఆరోపణలు ఎక్కువైపోవటంతో ఐటి ఉన్నతాధికారులు ఆరోగ్యశాక మంత్రి సి. విజయభాస్కర్ ఇంటిపై చేసిన దాడిలో కోట్ల రూపాయలు దొరికాయి. అంతేకాకుండా సుమారు రూ. 80 కోట్ల రూపాయల పంపిణీకి సంబంధించిన పత్రాలు, డబ్బు కట్టలు, బ్యాంకుల నుండి డ్రా చేసిన వివరాలు, డబ్బులు అందుకున్న వారి వివరాలు కూడా దొరికినట్లు సమాచారం. విచిత్రమేమిటంటే నియోజకవర్గంలోని 2.6 లక్షల ఓటర్లలో 85 శాతం ఓటర్లకు డబ్బులు పంచాలని దినకరన్ తరపున మంత్రి వ్యూహం సిద్ధం చేసారు. ప్రతీ ఓటర్కు కనీసం రూ. 4 వేలు ఇవ్వాలని లక్ష్యంగా  పెట్టుకున్నారు.

అయితే, ఇప్పటికే పంపిణీ చేసిన డబ్బుపై రకరకాల సంఖ్యలు ప్రచారంలో ఉంది. ఇదిలావుండగా, దినకరన్ పంపిణీ చేసిన డబ్బుపైనే గోల మొదలవ్వటంతో ఇతర అభ్యర్ధులు కూడా ఏమైనా డబ్బు పంపిణీకి ప్రయత్నించిరా అన్నది తేలలేదు. డబ్బు పంపిణీ చేయకుండా ఎవరైనా ఎందుకుంటారు? ఏదేమైనా మిగిలిన అభ్యర్ధులు కూడా డబ్బు పంపిణీ చేసినా దినకరన్ చేసిన పంపిణీ ముందు వాళ్ళంతా తేలిపోయారు.