ఎన్టీఆర్ ఇప్పుడు గుర్తొచ్చాడా, అల్లుడి క్యాంటిన్లుగానే... ?

First Published 26, Apr 2018, 5:35 PM IST
RK criticises Chandrababu on Anna canteens
Highlights

చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ కొత్త పద్ధతిలో ప్రజలను దోచుకోవడం మొదలుపెట్టారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ కొత్త పద్ధతిలో ప్రజలను దోచుకోవడం మొదలుపెట్టారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే అన్నా క్యాంటీన్లను తెరపైకి తీసుకొచ్చారని అన్నారు. 

గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన 630 హామీల్లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటు ఒకటని, నాలుగేళ్లుగా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయని చంద్రబాబు ఇప్పుడు హడావిడిగా అన్నా క్యాంటీన్ల ప్రకటన చేసారని ఆయన అన్నారు. 

ఎన్టీఆర్ పేరు వినకూడదనే ఇన్నాళ్లు ఆ అంశాన్ని పక్కన పెట్టారని, ఇప్పుడు ఎన్నికల వేళ అన్నా క్యాంటీన్ అంటూ డ్రామాలు ప్రారంభించారని అన్నారు. ప్రజలు మాత్రం వాటిని అల్లుడి క్యాంటిన్లుగానే భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. 

చంద్రబాబు, లోకేష్  అన్నా క్యాంటీన్ల ద్వారా పెద్ద యెత్తున దోపిడీకి తెర లేపారని అన్నారు. దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలను అన్నా క్యాంటీన్లకు కేటాయిస్తూ టిడిపి ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. 

రాష్ట్రంలో 163 క్యాంటీన్లకు గాను రూ.59 కోట్ల రూపాయల టెండర్లు ఆహ్వానించారని, ఒక్కో క్యాంటీన్ నిర్మాణానికి రూ.36 లక్షలు అవుతుందని, ఆ లెక్కన నిర్మాణం కోసం చదరపు అడుగుకు రూ.5 వేలు ఖర్చు చేస్తున్నారని ఆయన అన్నారు. పేదవాడికి అన్నం పెట్టే పథకంలో కూడా అవినీతికి పాల్పడాలని చూస్తున్నారని ఆయన అన్నారు. 

loader