తన ఆరోగ్యం సరిగా లేదని చంద్రబాబునాయుడు మొదటిసారిగా ప్రకటించారు. అనారోగ్య కారణాల రీత్యా తనను దావోస్ కు వెళ్ళవద్దని డాక్టర్లు సూచించాని లెక్క చేయకుండా వెళ్ళినట్లు తెలిపారు. శనివారం మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ, తన కుడి చెయ్యి సరిగా పనిచేయటం లేదని చెప్పారు. అనారోగ్యం గురించి చంద్రబాబు బహిరంగంగా ప్రకటించగానే పార్టీ, ప్రభుత్వంలో సంచలనంగా మారింది. మొన్నటి దావోస్ పర్యటనలో కూడా అక్కడ ఎన్డిటీవీతో మాట్లాడుతూ, తన క్రమశిక్షణే తనకు ఆరోగ్యమని చెప్పారు. అటువంటిది విజయవాడకు తిరిగి వచ్చిన మరుసటి రోజే తనకు అనారోగ్యంగా ఉందని స్వయంగా చంద్రబాబే చెప్పటంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

తన కుడి చేయి సరిగా పనిచేయకపోవటంతో ఇప్పటిదాకా పదిసార్లు ఫిజియోథెరపీ చేయించుకున్నట్లు తెలిపారు. తీవ్ర అస్వస్థతతో ఉన్న తనను డాక్టర్లు దావోస్ వెళ్ళొద్దని చెప్పారని, అయినా వినకుండా వెళ్ళానని ఆయన చెప్పుకొచ్చారు. దావోస్‌లో తన ఆరోగ్యం బావుండక నిద్రకూడా పోలేదన్నారు. ఇదంతా ప్రజల కోసం చేస్తున్నానని, అయినా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు వాపోయారు.