Asianet News TeluguAsianet News Telugu

ఆనందయ్య మందు తీసుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి

బొనిగె ఆనందయ్య కరోనా మందు తీసుకుని కోలుకున్నానని చెప్పిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మరణించారు. జిజిహెచ్ లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతూ ఆయన మరణించారు.

Retired Head master Kotaiahm who took Anandayya medicine dies
Author
Guntur, First Published May 31, 2021, 10:14 AM IST

నెల్లూరు: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొనిగె ఆనందయ్య కరోనా మందు తీసుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మరణించారు. గత పది రోజులుగా నెల్లూరు జిజీహెచ్ లో చికిత్స పొందుతున్న కోటయ్య చనిపోయారు. కరోనాతోనే ఆయన మరణించినట్లు చెబుతున్నారు. 

అయితే కరోనాతో మరణించారా, ఇతర అనారోగ్య సమస్యల వల్ల మరణించారా అనే విషయం తెలియదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గత నాలుగు రోజులుగా ఆయన వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఆయనను వెంటిలేటర్ మీద పెట్టారు.

పది రోజుల క్రితం అనారోగ్యంతో కోటయ్య జిజిహెచ్ లో చేరారు అంతకు ముందు ఆయన ఆనందయ్య మందు తీసుకున్నారు. ఆ మందుతో తాను కోలుకున్నట్లు ఆయన తెలిపారు. మరణదశలో ఉన్న తాను కరోనా మందు తీసుకుని కోలుకున్నట్లు తెలిపారు. తన శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పెరిగాయని ఆయన చెప్పారు ఆయన చెప్పిన విషయాలతో కూడిన వీడయో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇదిలావుంటే, కరోనా మందు ఇస్తున్న బొనిగె ఆనందయ్య తనకు ఫోన్ చేశారని సిపిఐ నేత నారాయణ చెప్పారు. అయితే, ఎక్కడున్నారంటే సమాధానం చెప్పడం లేదని ఆయన అన్నారు. కార్పోరేట్ సంస్థల ఒత్తిడితో ప్రభుత్వం ఆనందయ్యను నిర్బంధించిందని ఆయన అన్నారు.

కావాలంటే ఆనందయ్య మందుపై పరిశోధనలు చేసుకోవాలని, అంతే గానీ నిర్బంధించడం సరి కాదని ఆయన అన్నారు. ఆనందయ్యను ఆచూకీ విషయంలో తాను కోర్టులో పిటిషన్ వేస్తానని నారాయణ చెప్పారు. 

ఇదిలావుంటే ఆనందయ్య మందుపై ఈ రోజు సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఆనందయ్య మందు పంపిణీకి అనుమతించాలని కోరుతూ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. 

ఇదిలావుంటే, నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామంలో ఆనందయ్య కరోనాకు మందు పంపిణీ చేస్తున్న క్రమంలో విపరీతమైన ప్రచారం జరిగింది. దాంతో వేలాది మంది ఆయన మందు కోసం బారులు తీరడం ప్రారంభించారు. ఈ స్థితిలో ఆనందయ్యను పోలీసులు రహస్య ప్రదేశంలో కొంత కాలం ఉంచారు. ఆ తర్వాత భార్య ఒత్తిడితో కృష్ణపట్నం తీసుకుని వచ్చారు. 

ఆ మర్నాడే మళ్లీ ఆయనను, ఆయన భార్యను రహస్య ప్రదేశానికి తరలించారు. ప్రస్తుతం ఆనందయ్య ఎక్కడున్నారనేది స్పష్టంగా తెలియడం లేదు. మరోవైపు ఆనందయ్య మందుపై పరిశోధనలు జరుగుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios