వారికి పెళ్లై.. కనీసం రెండు నెలలు కూడా కాలేదు. అంతలో ఆషాడమాసం రావడంతో.. భార్యను పట్టింట్లో దింపేసి వెళ్లాడు. మరో వారంలో వచ్చి కలుస్తానని మాట ఇచ్చాడు. కానీ..అంతలోనే అనంతలోకాలకు చేరిపోయాడు. ఈ సంఘటన విజయనగరంలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామానికి చెందిన మహంతి గౌరీశంకర్రావు (28) విశాఖ పరవాడలో సాయినార్‌ లైఫ్‌సైన్సెస్‌లో నాలుగేళ్లుగా కెమిస్ట్‌గా పని చేస్తున్నాడు. అతనికి ఈ ఏడాది ఏప్రిల్ 8న శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సంచాం గ్రామానికి చెందిన వెంకటలక్ష్మితో వివాహమైంది. ఈ నెల 21న ఆషాఢం కారణంగా  పుట్టింటికి వెళ్లిన వెంకటలక్ష్మి వద్దకు గత బుధవారం గౌరీశంకర్‌  వెళ్లాడు. భార్యతో మూడు రోజుల్లో మళ్లీ వస్తానని చెప్పి విధులకు వెళ్లాడు.

అయితే.. ఇటీవల జరిగిన గ్యాస్ లీక్ ప్రమాదంలో గౌరీ శంకర్రావు ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. భర్త మృతితో భార్య గొల్లుమంది. ఘటనతో మృతుడు అత్తవారి గ్రామం సంచాం, స్వగ్రామం రెల్లివలస గ్రామంలోను విషాదం నెలకొంది. గౌరీశంకర్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వగ్రామం తీసుకురావడానికి బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు.