విశాఖలో రియల్టర్ మధు కిడ్నాప్: రౌడీషీటర్‌పై సీపీకి బాధిత కుటుంబం ఫిర్యాదు
విశాఖపట్టణంలో రియల్టర్ మధు కిడ్నాప్ కలకలం రేపుతుంది. మధు కుటుంబ సభ్యులు విశాఖ సీపీని కలిసి ఈ విషయమై ఫిర్యాదు చేశారు.
విశాఖపట్టణం: విశాఖపట్టణంలో రియల్టర్ మధు కిడ్నాప్ ఘటన కలకలం రేపుతుంది. రియల్టర్ కుటుంబ సభ్యులు విశాఖపట్టణం సీపీ శ్రీకాంత్ ను శుక్రవారం నాడు కలిశారు. కిడ్నాప్‌నకు పాల్పడిన రౌడీ షీటర్ పై చర్య తీసుకోవాలని మధు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. విశాఖపట్టణానికి చెందిన రియల్టర్ మధు, రౌడీ షీటర్ హేమంత్ మధ్య ప్లాట్ విక్రయం విషయంలో గొడవ చోటు చేసుకుంది.
ఈ విషయమై రూ. 12 లక్షలు చెల్లించాలని రియల్టర్ మధును రౌడీ షీటర్ హేమంత్ కుమార్ డిమాండ్ చేసినట్టుగా మధు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని విశాఖపట్టణం సీపీ శ్రీకాంత్ కు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం కారణంగానే మధును రౌడీ షీటర్ హేమంత్ కిడ్నాప్ చేసినట్టుగా రియల్టర్ కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. రియల్టర్ మధు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మధు కిడ్నాప్‌నకు సహకరించారనే అనుమానంతో ఏడుగురిని విశాఖపట్టణం పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.