సిట్ విచారణకు 28 న రవితేజ హాజరు ఇప్పటికే రెండు సార్లు వాయిదా విచారణ పై కొనసాగుతున్న ఉత్కంట


సిట్ విచారణలో మాస్ మహారాజా రవితేజ ఒంతు ఎప్పుడొస్తుందా అని ఇటు సినీ వర్గాల్లో అటు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. రవితేజ విచారణ ఎప్పుడు జరుగుతుందా అని జనాల్లోనూ ఆసక్తి రోజురోజుకు పెరుగుతుంది. ఇప్పుడు ,అప్పుడు అంటూ డేట్స్ మారుతుండటంతో ఆ ఉత్కంట రెట్టింపయ్యింది. అసలెందుకు రవితేజ విచారణపై సస్పెన్స్ కొనసాగుతోందన్నది అంతుపట్టడంలేదు. 
ఇప్పటికే రవితేజ విచారణ డేట్స్ రెండు సార్లు మారిపోయాయి. మరి ఇప్పుడు 28న ఫిక్స్ చేసారు. అప్పుడైనా విచారణ జరుగుతుందా, లేక మళ్లీ మారుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు నోటీసులు అందిన అందరు సెలబ్రిటీల విషయంలో క్లారిటిగా ఉన్న సిట్ బృందం రవితేజ విషయంలో మాత్రం గందరగోళంలో ఉన్నట్లు కనిపిస్తోంది.
తెలుగు పరిశ్రమలో ఇప్పటి వరకు డ్రగ్ కేసులో నోటీసులు అందుకున్న వారిలో పెద్ద తలలు రెండు మాత్రమే. ఒకరు పూరి జగన్నాథ్ కాగా మరొకరు రవితేజ. అయితే సిట్ అధికారులు పూరీని మామూలుగానే విచారించినా, రవితేజ విషయంలో గోప్యత పాటిస్తున్నారు. అసలు నిజంగా మొదట విచారించాల్సింది రవితేజనే .ఎందుకంటే గతంలోనే ఆయన తమ్ముళ్లు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు. అప్పుడే రవితేజ తన తమ్ముళ్లతో ఈ వ్యవహారం నడిపిస్తున్నాడన్న అనుమానాలను పోలీసులు వ్యక్తపర్చారు. కానీ అవేవీ నిరూపితం కాలేవు. కానీ ఇప్పుడు ఆయన పేరు బయట పడటంతో ఆయనపై ఉన్న అభియోగాలు నిజమేనేమో అన్న అనుమానం జనాల్లో కలుగుతోంది.
రవితేజ పేరు బయటకు రావడం, విచారణపై క్లారిటీ లేకపోవడం,సిట్ అధికారులు దీనిపై సమాచారం బయటకు రానివ్వక పోవడం ఇవన్నీ జనాలకు యక్ష ప్రశ్నలను తలపిస్తున్నాయి. పూరీకి రవితేజ సన్నిహితుడు కావడం, పెద్ద హీరో కావడంతో సమజంగానే అందరి దృష్టి ఈయన విచారణపై ఉంటుంది.కానీ ప్రతిసారి అది డేట్లు మారుతూ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది.
అయితే సిట్ అధికారుల దర్యాప్తులో జిషాన్ అలీ రవితేజ పేరును వెల్లడించాడని సమాచారం. గతంలోని ఆయనపై వచ్చిన ఆరోపణలతో,జిషాన్ అలీ విచారణ అంశాలను దృష్టిలో పెట్టుకునే పోలీసులు విచారణను లోతుగా చేయనున్నారు. అందుకోసమే సమయాన్ని పొడిగిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పెద్ద హీరో కావడం, పక్కా ఆధారాలు లభించిన తర్వాతే రవితేజను సిట్ ఆఫీసు మెట్లెక్కించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.