కడప జిల్లా జమలమడుగు టిడిపిలో వర్గ రాజకీయాలు మరోసారి రెచ్చిపోయాయి. రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ కార్యాలయంపై రామసుబ్బారెడ్డి వర్గీయులు దాడి చేశారు. నియోజకవర్గంలోని కొండాపురంలో ఉన్న రమేష్ కార్యాలయంపై సుబ్బారెడ్డి వర్గీయులు ఒక్కసారిగా దాడి చేశారు. కార్యాలయంలోని ఫర్నీచర్, కంప్యూటర మొత్తాన్ని ధ్వంసం చేశారు. గండికోట రిజర్వాయర్ పరిధిలోని ముంపు బాధితుల ఇళ్ళ నిర్మాణం కాంట్రాక్టు విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది.

టిడిపిలోనే ఉన్న రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్, ఎంఎల్సీ రామసుబ్బారెడ్డికి ఎప్పటి నుండో పడదు. ఏ సందర్భంలో అయినా కానీ రెండు వర్గాలు ఎదురుపడితే గొడవలు ఖాయం. ఇద్దరికి మధ్య వివాదాన్ని సర్దుబాటు చేద్దామని చంద్రబాబునాయుడు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. వీళ్ళద్దరికీ తోడు మంత్రి ఆదినారాయణ రెడ్డి వర్గం ఎటూ ఉండనే ఉంది. ఒకవిధంగా జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్, ఎంఎల్సీ రామసుబ్బారెడ్డి వర్గీయులు ఎవరికి వారుగా కొట్టుకుంటున్నారు. దాంతో జమ్మలమడుగు నియోజకవర్గం టిడిపిలో వర్గ రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో అని ఆందోళన పడుతున్నారు.