చంద్రబాబు హెల్త్ బులెటిన్... బరువు, బిపి, ఫల్స్ రేట్ ఎలా వున్నాయంటే...
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి హెల్త్ బులెటిన్ ను రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు విడుదల చేసారు

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, టిడిపి శ్రేణుల ఆందోళనకు గురవుతున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా చంద్రబాబుకు తగిన వైద్యం అందించడంలేదని... సౌకర్యాలు కల్పించాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోవడం లేదంటూ రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జైలు అధికారులు గత రెండ్రోజులుగా చంద్రబాబుకు ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను విడుదల చేస్తున్నారు.
తాజాగా రాజమండ్రి జైలు అధికారులు చంద్రబాబు హెల్త్ బులెటిన్ విడుదల చేసారు. ఇందులో చంద్రబాబును రిమాండ్ ముద్దాయిగా పేర్కొన్నారు. ఆయన ఖైదీ నెంబర్ 7691 ను కూడా పొందుపర్చారు. రాజమండ్రి జైల్లోని వైద్య అధికారులతో పాటు రాజమండ్రి ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ అధికారుల బృందం చంద్రబాబును పరీక్షించినట్లు... వారు ఇచ్చిన నివేదికను విడుదల చేస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు.
Read More జైల్లోని చంద్రబాబు హెల్త్ బులెటిన్... బరువు, బిపి తో సహా ఆరోగ్య పరిస్థితి ఇదే...
ఈ నివేదిక ప్రకారం చంద్రబాబు బిపి (బ్లడ్ ప్రెషర్) 130/80 గా వుంది. ఇక ఫల్స్ నిమిషానికి 64, రెస్పిరేటరీ రేట్ నిమిషానికి 12, ఆక్సిజన్ శాచ్యురేషన్ గది ఉష్ఫోగ్రత వద్ద 97 శాతంగా వుంది. శరీర ఉష్ణోగ్రత సాధారణంగానే వున్నట్లు పేర్కొన్నారు. గుండె, ఊపిరితిత్తుల పనితీరు సాధారణంగానే వుందని... ఫిజికల్ గా యాక్టివ్ గా వున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు 67 కిలోల బరువు వున్నట్లు జైలు అధికారులు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. ఇలా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వున్నట్లు అధికారులు తెలిపారు.
బులెటిన్ కాదు సమగ్ర రిపోర్ట్ కావాలి... చంద్రబాబు కుటుంబం
అయితే చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై అరకోర సమాచారంతో జైలు అధికారులు బులెటిన్ విడుదల చేస్తున్నారని... సమగ్ర హెల్త్ రిపోర్ట్ ను బయటపెట్టాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. చంద్రబాబు షుగర్ లెవెల్స్ గురించి హెల్త్ బులెటిన్ లో ప్రస్తావించడం లేదని అంటున్నారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను లిఖిత పూర్వకంగా కోరినా జైలు అధికారులు అందించడం లేదంటూ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యుల నివేదికను ఇవ్వాలంటూ ఏసిబి కోర్టులో ఆయన తరపు లాయర్లు పిటిషన్ దాఖలుచేసారు.