జైల్లోని చంద్రబాబు హెల్త్ బులెటిన్... బరువు, బిపి తో సహా ఆరోగ్య పరిస్థితి ఇదే...
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి రాజమండ్రి జైలు అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేసారు.

అమరావతి : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై కుటుంబసభ్యులు, టిడిపి శ్రేణుల ఆందోళన నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు స్పందించారు. చంద్రబాబు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన హెల్త్ బులెటిన్ విడుదల చేసారు. రాజమండ్రిలో వాతావరణ పరిస్థితుల కారణంగా చంద్రబాబు డీహైడ్రేషన్ తో పాటు స్కిల్ ఎలర్జీతో బాధపడటంతో జైల్లోని వైద్యసిబ్బందితో పాటు మరికొందరు వైద్య నిపుణులతో పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. డాక్టర్ల సూచన మేరకే వైద్యం అందిస్తున్నామని... ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గానే వున్నట్లు రాజమండ్రి జైలు అధికారులు తెలిపారు.
చంద్రబాబు చల్లని వాతావరణం అవసరమని వైద్యులు సూచించడం... ఆ సదుపాయం కల్పించాలని కోర్టు ఆదేశించినట్లు జైలు అధికారులు తెలిపారు. దీంతో చంద్రబాబు గదిలో టవర్ ఏసి ఏర్పాటుచేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఆయన బరువు తగ్గినట్లు... సరిగ్గా కూర్చోలేని స్థితిలో వున్నట్లు జరుగుతున్న ప్రచారంపైనా జైలు అధికారులు రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం చంద్రబాబు 67 కిలోల బరువు వున్నారని... ఫిజికల్ యాక్టివిటీ కూడా బాగానే వున్నట్లు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు.
ఇక చంద్రబాబు బిపి (80/140) నార్మల్ గానే వున్నట్లు వైద్య పరీక్షలో గుర్తించినట్లు జైలు అధికారులు వెల్లడించారు. అలాగే పల్స్ నిమిషానికి 70, రెస్పిరేటర్ రేటు నిమిషానికి 12 గా వుందని వైద్యులు గుర్తించినట్లు తెలిపారు. ఇలా చంద్రబాబు ఆరోగ్యంగానే వున్నట్లు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు వెల్లడించారు.
Read More క్షీణిస్తున్న చంద్రబాబు ఆరోగ్యం... అత్యంత ప్రమాదకరంగా..: అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు
ఇదిలావుంటే చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన సతీమణి భువనేశ్వరి, కొడుకు కోడలు లోకేష్, బ్రాహ్మణి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చంద్రబాబుతో ములాఖత్ అయిన భువనేశ్వరి, లోకేష్ ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు బయటపెట్టారు. బాగా బరువు తగ్గిపోయి చాలా నీరసంగా వున్న చంద్రబాబు కనీసం సరిగ్గా కూర్చోలేకపోతున్నారని... అతడి చూసి భువనేశ్వరి కన్నీటిపర్యంత అయినట్లు సమాచారం. చర్మ సంబంధిత సమస్యతో ఆయన శరీరంపై దద్దుర్లు వచ్చినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇలా చంద్రబాబు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా జైలు అధికారులు కనీస వైద్యం అందించడంలేదని... అంతా బాగానే వుందని తప్పుడు నివేదికలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు.
ఇక చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వివాదం నేపథ్యంలో ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్నారు రాజమండ్రి జైలు అధికారులు. ఇలా తాజాగా విడుదల చేసిన బులెటిన్ లో చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే వుందని తెలిపారు. కోర్టు ఆదేశాలతో చంద్రబాబుకు ఏసి సదుపాయం కూడా కల్పించినట్లు రాజమండ్రి జైలు అధికారులు వెల్లడించారు.