న్యూఢిల్లీ: వైసీపీ తిరుగుబాటు పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణమ రాజు పరోక్షంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను టార్గెట్ చేశారు. తిరుమలలో అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని టీటీడీ చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి చెప్పిన విషయాన్ని ఆయన శనివారం లోకసభలో ప్రస్తావించారు. ఒక్క వ్యక్తి కోసం తిరుమలలో నిబంధన మార్చారని ఆయన అన్నారు. జగన్ ను ఉద్దేశించే ఆయన ఆ వ్యాఖ్య చేశారని భావిస్తున్నారు. 

రఘురామ రాజును వైసీపీ ఎంపీలు అడ్డుకునే ప్రయత్న చేశారు. ఏపీలో ఉద్దేశ్యపూర్వకంగానే హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ఈ ఘటనలపై ధార్మిక సంస్థతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. రఘురామ రాజు మాట్లాడుతున్న సమయంలో లోకసభలో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. 

అంతకు ముందు రఘురామకృష్ణమ రాజు విడిగా మీడియా ముందు మాట్లాడారు. తిరుమలలో అన్యమతస్తుల డిక్లరేషన్ మీద జగన్ ఎందుకు సంతకం చేయలేదని ఆయన ప్రశ్నించారు. సెక్యులర్ వాదిగా సీఎెం జగన్ సంతకం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. నిబంధనలు సరిగా అమలు పరచని టీటీడీ చైర్మన్ మీద చర్యలు తీసుకోవాలని, తిరుమలలో ఆలయ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రభుత్వ బాండ్లలో టీటీడీ నిధులు పెట్టుబడులు పెట్టడం సరి కాదని, దేవుడి సొమ్మును దోచుకునే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బ తీయవద్దని ఆయన కోరారు. అమ్మ ఒడి డబ్బు నాన్న బుడ్డికి వెళ్లిపోతోందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ముగ్గురి కోసం ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు 

తనపై అనర్హత వేటు సాధ్యం కాదని, రాజ్యాంగాన్ని గౌరవిస్తానని ఆయనయ చెప్పారు. వైసీపీ ఎంపీలు న్యాయవ్యవస్థను కించపరచడం సరి కాదని రఘురామ కృష్ణమ రాజు అన్నారు. తనకు బెదిరింపులు, కేసులు, అనర్హత వేటు విషయాలను ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ ద్వారా తెలియజేశానని ఆయన చెప్పారు.