ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపీ) అధినేత వైఎస్ జగన్ తో తెగదెంపులు చేసుకోవడానికే ఆ పార్టీ తిరుగుబాటు పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణమ రాజు సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. వైసీపీ నేతల చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే విషయంలో ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గకపోగా వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు.

వైసీపీ చిక్కుల్లో పడేయడానికి అవసరమైన చర్యలకు రఘురామ కృష్ణమ రాజు దిగుతున్నారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురికావడమే లక్ష్యంగా ఆయన పార్టీపై ధ్వజమెత్తుతున్నట్లు కనిపిస్తున్నారు. తాజాగా, ఆయన ఢిల్లీ వెళ్లడానికి సిద్ధపడ్డారు. తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ నరసాపురం పార్లమెంటు సభ్యుడిగా ఉన్న రఘురామ కృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

Also Read: జగన్ ఇంటికి ఇప్పటికీ వెళ్లలేదు: ఎంపీ రఘురామ కృష్ణమరాజు కౌంటర్

తన ప్రాణాలకు హానీ ఉందంటూ ఆయన లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ కూడా రాశారు. ఈ స్థితిలో ఆయన ఢిల్లీ వెళ్లి జగన్ ను మరింతగా చిక్కుల్లో పడేయాలని చూస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో ఆయన హస్తినకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

ఢిల్లీలో ఆయన లోకసభ స్పీకర్ ఓం బిర్లాను, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుస్తారు. అయితే, కరోనా ఉధృతి ఢిల్లీలో మరింతగా పెరిగితే మాత్రం తన ఢిల్లీ యాత్రను ఆయన వాయిదా వేసుకునే అవకాశం ఉంది. 

గత కొద్దికాలంగా రఘురామ కృష్ణమరాజు జగన్ కు కొరుకుడు పడని కొయ్యగా మారారు. ఆయన వ్యాఖ్యలను వైసీపీ తీవ్రంగా తప్పు పట్టారు. ఆయనపై ఎదురుదాడికి దిగారు. అయినా ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తన వ్యూహాలకు పదును పెడుతూనే ఉన్నారు.