న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపీ) తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మీద ప్రశంసల జల్లు కురిపించారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునే అన్యమతస్థులు తప్పకుండా సంతకం చేయాల్సిందేనని ఆయన అన్నారు. 

సంతకం చేసిన తర్వాతనే వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఆయన అన్నారు. హిందూ మతం జోలికి రావద్దని హెచ్చరించారు. మత రాజకీయాలు మానుకోవాలని సూచించారు. వైఎస్ జగన్ తన స్థాయిని తగ్గించుకుంటున్నారని ఆయన అన్నారు. తన మీద కేసులు పెట్టించారని ఆయన ఆరోపించారు. తనను చంపిస్తానన్న వ్యక్తి చేతనే తనపై కేసులు పెట్టించారని ఆయన అన్నారు. 

వైఎస్ జగన్ ధైర్యవంతుడు, మగాడు అనుకున్నానని, అయితే ప్రలోభపెట్టి తనపై కేసులు పెట్టిస్తారని అనుకోలేదని ఆయన అన్నారు. ఆ రకంగా తన స్థాయిని తగ్గించుకుంటారని అనుకోలేదని అన్నారు. జగన్ స్థాయి ఉన్నతంగా ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను మొదటి వరుసలో ఉంటానని ఆయన అన్నారు. మనం మనం ముఖాముఖి చూసుకుందామని ఆయన అన్నారు. 

జగన్ కు చెప్పే అవకాశం తనకు రావడం లేదని, అందువల్లే మీడియా ద్వారా విషయాలు జగన్ కు చెబుతున్నానని ఆయన అన్నారు. జగన్ బ్రహ్మాస్త్రం ప్రయోగించారని అంటున్నారని, అయితే జగన్ స్థాయి బ్రహ్మాస్త్రం స్థాయి కాదని, అంతకన్నా పెద్దదని ఆయన అన్నారు. కానీ జగన్ తన స్థాయిని తనంత తాను తగ్గించుకుంటున్నారని రఘురామకృష్ణమ రాజు అన్నారు.  చేయి విరగగొడితే చేయి విరగగొడుతారని ఆయన ్న్ారు.

న్యాయం అమరావతి వక్షాన ఉందని ఆయన అన్ారు. రైతులకు న్యాయం జరగాలంటే అమరావతి రాజధానిగా ఉండాలని పవన్ కల్యాణ్ కోరుకుంటున్నారని, న్యాయం కోసం వాదించే పాత్రలో ఆయన నటిస్తున్నారని ఆయన చెప్పారు. అత్తారింటికి దారేది అంటూ సినిమా చేసిన పవన్ కల్యాణ్ అమరావతికి దారేది అంటూ వెతుక్కుంటూ వస్తున్నారని ఆయన అన్నారు. 

పాపులర్ లీడర్ వచ్చిన తర్వాత అందరికీ ధైర్యం పెరుగుతుందని ఆయన అన్నారు. ఇతర రాజకీయ పార్టీలు కూడా ముందుకు వస్తాయని ఆయన చెప్పారు. అమరావతి అనేది కొన్ని గ్రామాల సమస్య కాదనీ... రాష్ట్ర సమస్య అని ఆయన అన్నారు. జీఎస్టీ బకాయిల వంటివాటిపై మాట్లాడకుండా వైసీపీ ఎంపీలు ఇంకేదో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.