Asianet News TeluguAsianet News Telugu

జగన్ బెదిరించారు, నా భర్తను జైల్లో చంపేస్తారు: రఘురామ భార్య రమాదేవి

తన భర్త పరిస్థితిపై వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు సతీమణి రమాదేవి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకోవాలని సీఎం జగన్ బెదిరించారని ఆమె చెప్పారు.

Raghurama Krishnam raju wife Rama Devi says her husband is facing life threat
Author
Amaravathi, First Published May 16, 2021, 7:25 PM IST

అమరావతి: తన భర్తను గుంటూరు జైలుకు తరలించిన నేపథ్యంలో వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు సతీమణి రమాదేవి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్త క్రిమినల్ కాదని ఆమె అన్నారు. తన భర్తకు ఏదైనా జరిగితే సీఎం జగన్, సీఐడీ డీఐజీ సునీల్ బాధ్యత వహించాలని ఆమె అన్నారు.

తన భర్తను జైల్లో చంపడానికి కుట్ర పన్నారని ఆమె ఆరోపించారు. ఇప్పటికే కడపకు చెందిన వ్యక్తులను జైలుకు పక్కా ప్రణాళికతో ముందుగానే తరలించారని వివరించారు. తన భర్తను మొన్న సాయంత్రం అరెస్ట్ చేసి తీసుకెళ్లారని, అర్ధరాత్రి వేళ ఆయనను తీవ్రంగా కొట్టారని ఆమె అన్నారు. 

బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని రఘురామను సీఎం జగన్  బెదిరించారని, ఆయన అందుకు అంగీకరించకపోవడంతో బాగా కొట్టారని తెలిపారు. ఆయన అరెస్టయిన సమయంలో బాగా నడుచుకుంటూ వెళ్లారని, అలాంటిది ఒక్కరోజులో పరిస్థితి మారిపోయిందని రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. 

రమేశ్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉన్నా, కేవలం జీజీహెచ్ తోనే సరిపెట్టారని, ఆయన వెంట భద్రతా సిబ్బంది లేరని, కుటుంబసభ్యులం తాము కూడా లేమని, ఇవాళ హైకోర్టులో విచారణ ఉన్నప్పటికీ జైలుకు తరలించారని అన్నారు. దీని వెనుక కుట్ర ఉందని భావిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. 

తన భర్తకు ఏదైనా జరిగితే సీఎం జగన్, ఏపీ సీఐడీ డీఐజీ సునీల్ కుమార్ బాధ్యత వహించాలని హెచ్చరించారు. తన భర్తేమీ క్రిమినల్ కాదని, ఉగ్రవాది అంతకన్నా కాదని రమాదేవి స్పష్టం చేశారు. నేరాలు చేసినవారందరూ హాయిగా తిరుగుతున్నారని మండిపడ్డారు. తన భర్త రఘురామరాజును తాను ఇప్పుడు చూడాలనుకుంటున్నానని, ఆయన పరిస్థితి ఏంటన్నది తెలుసుకోవాలనుకుంటున్నానని రమాదేవి అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios