న్యూఢిల్లీ: తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల శ్రీవారి దర్శనం చూసి క్రైస్తవులు అయోమయానికి గురయ్యారని వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు అన్నారు. జగన్ క్రైస్తవుడేనా కాదా అని క్రిస్టియన్లు అయోమయంలో పడ్డారని ఆయన అన్నారు. కొంత మంది ఫాస్టర్లు ఆందోళన చేసినట్లు కూడా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వచ్చాయని ఆయన అన్నారు. 

హిందూమతం మీద జగన్ కు గౌరవం ఉందా, లేదా అని హిందువులు సందేహిస్తున్నారని ఆయన అన్నారు. వాటికి సమాధాన చెప్పాలని ఆయన అన్నారు. జగన్ విజయంలో స్వరూపానందేంద్ర స్వామి పాత్ర ఉందనేది కాదనలేని సత్యమని అంటూ జగన్ హిందువా, క్రైస్తవుడా అనేది స్వరూపానందేంద్ర స్వామి చెప్పాలని, జగన్ ముస్లిమైతే కాదని ఆయన అన్నారు. జగన్ హిందూ మతానికి తిరిగి వచ్చాడని నమ్మించి ఎన్నికల్లో గెలిపించారని ఆయన అన్నారు. స్వరూపానందేంద్ర స్వామి తలుచుకుని హిందూ దేవాలయాలపై దాడులు ఆపించాలని ఆయన కోరారు. 

మంత్రి కొడాలి నానిపై కూడా రఘురామ కృష్ణమరాజు విరుచుకుపడ్డారు. హిందూ దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసంపై నాని చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. గురువారం ఆయన ఢిల్లీలో రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు. మంత్రి గానీ వేరే ఎవరైనా గానీ మన ఇంట్లో పెట్టుకున్న ఇష్టమైన వ్యక్తులు లేదా దేవుళ్ల ఫొటోలపై ఎవరైనా ఉమ్మి వేసి ఫొటోయే కదా ఇంకొక ఫొటో ఇస్తాలే అని అంటే ఊరుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. ఏమవుతుందంటే ఇది అంతేనని ఆయన అన్నారు.

దేవాలయాల్లో విగ్రహాలను పగులగొట్టి ఇంకోటి పెడుదామని, రథం దగ్ధం అయితే కొత్తది వస్తుందని అంటే సరి కాదని ఆయన అన్నారు. ఇలాగే ఉంటే ప్రజలు తిరగబడి బుద్ధి చెప్పే రోజు వస్తుందని ఆయన అన్నారు. కొడాలి నాని ప్రదాని నరేంద్ర మోడీపై, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిపై వ్యాఖ్యలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. అసలు వాళ్ల గురించి తెలుసుకోకుండా దుర్భాషలాడడం దురదృష్టకరమని ఆయన అన్నారు.