చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాకు తమ పార్టీ నేతలు ఇబ్బందులు సృష్టిస్తారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్‌లో రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడకుండా సినీనటుల రెమ్యూనరేషన్ గురించి మాట్లాడటం ఏంటని రఘురామ మండిపడ్డారు.
మెగాస్టార్ చిరంజీవిపై వైసీపీ నేతలు, ఏపీ మంత్రులు చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ చిన్నదని, పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎందుకు అని చిరంజీవి అన్నారని పేర్కొన్నారు. రోడ్లను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోమని ఆయన సూచించారని.. దానికి మా పార్టీ నేతలు భుజాలు తడుముకుని మాట్లాడుతున్నారని రఘురామ చురకలంటించారు. చిత్ర పరిశ్రమ వల్ల ఎంతోమందికి ఉపాధి లభిస్తుందని.. ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్‌లో రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడకుండా సినీనటుల రెమ్యూనరేషన్ గురించి మాట్లాడటం ఏంటని రఘురామ మండిపడ్డారు. అసలు ఆయనకు బుద్దుందా.. హీరోల స్థాయిని బట్టి పారితోషికాలు వుంటాయని ఎంపీ చెప్పారు.
జగన్ వేల కోట్లు సంపాదించారని అందరూ అంటారని.. ఆ మొత్తాన్ని 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు వాటా ఇవ్వాలంటే ఎలా వుంటుందని రఘురామ చురకలంటించారు. వరదలతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతుంటే అంబటి రాంబాబు ఢిల్లీ వచ్చి బ్రో సినిమాపై ఫిర్యాదు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఆ సినిమాలో క్యారెక్టర్ చూసి మంత్రి ఎందుకు ఫీల్ అవుతున్నారని రఘురామ నిలదీశారు.
ALso Read: సినిమా వాళ్లు చెబితే వినే స్టేజ్‌లో లేం.. ముందు నీ తమ్ముడికి చెప్పుకో : చిరంజీవికి రోజా కౌంటర్
చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాకు తమ పార్టీ నేతలు ఇబ్బందులు సృష్టిస్తారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని కామెంట్ చేస్తున్న మంత్రుల్లో ఎవరికీ అంతటి స్థాయి లేదని.. అన్ని కులాల్లోనూ మెగాస్టార్‌కు ఫ్యాన్స్ వున్నారని రఘురామ కృష్ణంరాజు చెప్పారు. చిరంజీవిని కాపులతో తిట్టిస్తారా.. రెడ్డి అనేది సామాజికవర్గం కాదని, అది కేవలం టైటిల్ మాత్రమేనని ఎంపీ ఎద్దేవా చేశారు.
కాగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతూనే వున్నాయి. తాజాగా చిరుకు కౌంటరిచ్చారు మంత్రి రోజా. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హీరోలందరూ జగన్ దగ్గరకు ఎందుకెళ్లారని ప్రశ్నించారు. ఏ హీరో కూడా ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని ఆమె గుర్తుచేశారు. రాష్ట్రం విడిపోతున్నప్పుడు చిరంజీవి ఏం చేశారని రోజా నిలదీశారు. హోదా గురించి చిరంజీవి అప్పుడెందుకు అడగలేదని మంత్రి ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా వుండి ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టారా అని నిలదీశారు.
గడప గడపకు వచ్చి చూస్తే ఎన్ని రోడ్లు వేశామో తెలుస్తుందని రోజా పేర్కొన్నారు. చిరంజీవి చెబితే విని పనిచేసే పరిస్ధితిలో జగన్ లేరన్నారు. ఏ అర్హత వుందని సినిమా టికెట్ ధర పెంచమని అడిగారు అని ఆమె ఎద్దేవా చేశారు. సినిమా వేదికల మీద రాజకీయాలు ప్రస్తావించకూడదని రోజా చురకలంటించారు. చిరంజీవి ఎవరికైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ముందుగా ఆయన తమ్ముడికి ఇవ్వాలని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి చిరంజీవి లబ్ధి పొందారని, కానీ రాష్ట్రానికి చేసింది ఏం లేదన్నారు. సినిమా వాళ్లు చెబితే వినే స్థాయిలో తాము లేమని రోజా స్పష్టం చేశారు.
