ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి రోజా. సినిమా వాళ్లు చెబితే వినే స్థాయిలో తాము లేమని రోజా స్పష్టం చేశారు. ఏ అర్హత వుందని సినిమా టికెట్ ధర పెంచమని అడిగారు అని ఆమె ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతూనే వున్నాయి. తాజాగా చిరుకు కౌంటరిచ్చారు మంత్రి రోజా. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హీరోలందరూ జగన్ దగ్గరకు ఎందుకెళ్లారని ప్రశ్నించారు. ఏ హీరో కూడా ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని ఆమె గుర్తుచేశారు. రాష్ట్రం విడిపోతున్నప్పుడు చిరంజీవి ఏం చేశారని రోజా నిలదీశారు. హోదా గురించి చిరంజీవి అప్పుడెందుకు అడగలేదని మంత్రి ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా వుండి ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టారా అని నిలదీశారు.
గడప గడపకు వచ్చి చూస్తే ఎన్ని రోడ్లు వేశామో తెలుస్తుందని రోజా పేర్కొన్నారు. చిరంజీవి చెబితే విని పనిచేసే పరిస్ధితిలో జగన్ లేరన్నారు. ఏ అర్హత వుందని సినిమా టికెట్ ధర పెంచమని అడిగారు అని ఆమె ఎద్దేవా చేశారు. సినిమా వేదికల మీద రాజకీయాలు ప్రస్తావించకూడదని రోజా చురకలంటించారు. చిరంజీవి ఎవరికైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ముందుగా ఆయన తమ్ముడికి ఇవ్వాలని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి చిరంజీవి లబ్ధి పొందారని, కానీ రాష్ట్రానికి చేసింది ఏం లేదన్నారు. సినిమా వాళ్లు చెబితే వినే స్థాయిలో తాము లేమని రోజా స్పష్టం చేశారు.
Also Read: ‘‘బ్రో’’లో నా క్యారెక్టర్ పెట్టాడా , లేదా.. నువ్వే ధర్మం చెప్పు : చిరంజీవిపై అంబటి ప్రశ్నల వర్షం
అంతకుముందు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. సినిమాలను రాజకీయాల్లోకి తెచ్చింది ఎవరో చిరంజీవి చెప్పాలని ప్రశ్నించారు. ముందు తమ్ముడికి చెబితే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. మంత్రి రాంబాబు క్యారెక్టర్ సృష్టించింది ఎవరు అని గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు. ఆ పాత్ర రాంబాబుదేనని చెప్పే ధైర్యం కూడా లేదని మంత్రి దుయ్యబట్టారు.
అలాగే ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై కౌంటరిచ్చారు మంత్రి అంబటి రాంబాబు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి అన్నయ్యగారు అంటూ సెటైర్లు వేశారు. బ్రో సినిమాలో తన క్యారెక్టర్ పెట్టారో లేదో చిరంజీవి చెప్పాలని రాంబాబు డిమాండ్ చేశారు. చిరంజీవి ఏం మాట్లాడారో చూసి రేపు మాట్లాడతానని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
