హైదరాబాద్‌ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య ప్రశంసలతో ముంచెత్తారు. వైఎస్ జగన్ తండ్రికి తగ్గ తనయుడు అంటూ అభివర్ణించారు. 

హైదరాబాద్ లో ఆర్.కృష్ణయ్యను వైసీపీ బీసీ విభాగం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తితోపాటు పలువురు కలిశారు. ఈనెల 17న ఏలూరులో నిర్వహించనున్న వైసీపీ బీసీ గర్జనకు హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆర్.కృష్ణయ్య బీసీలకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో చేశారని కొనియాడారు. 

బీసీలు ఏది కోరితే అది కాదనకుండా చేశారని చెప్పుకొచ్చారు. ఎంత ఫీజు ఉంటే అంత రీయింబర్స్ మెంట్ ఇచ్చిన మహానేత వైఎస్ఆర్ అంటూ కొనియాడారు. 300 హాస్టళ్లు, విద్యార్థినులకు హాస్టళ్లు, మెయింటెనెన్స్ ఛార్జీలు పెంపు ఇలా ఎన్నో చేశారని గుర్తు చేశారు. 

ఉన్నత చదువులు చదివి ఆ కుటుంబాలు బాగుపడాలని రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. వైఎస్ జగన్ తండ్రికి తగ్గ తనయుడు అంటూ ప్రశంసించారు. జగన్ కు తండ్రిలాగే బీసీలంటే ప్రేమ అని చెప్పుకొచ్చారు. 

దేశవ్యాప్తంగా 36 పార్టీలను బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలని కోరితే స్పందించింది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టి మరీ ఈ అంశం పార్లమెంట్ లో చర్చకు కృషి చేశారని తెలిపారు. 

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ బీసీ గర్జనకు హాజరవుతానని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే తన జీవిత ఆశయం చట్టసభల్లో రిజర్వేషన్ల అంశం ముందుకు వెళ్తోందని ఆర్ కృష్ణయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

వైఎస్ జగన్ తో ఆర్.కృష్ణయ్య భేటీ

వైసీపీ బీసీ శంఖారావంకు జై కొట్టిన ఆర్ కృష్ణయ్య